రేపు బీసీల రాజకీయ మేధోమదన సదస్సు .. ఎన్నికల్లో బీసీల రాజకీయ విధానాన్ని ప్రకటిస్తాం 

రేపు బీసీల రాజకీయ మేధోమదన సదస్సు .. ఎన్నికల్లో బీసీల రాజకీయ విధానాన్ని ప్రకటిస్తాం 
  • బీసీ వ్యతిరేక పార్టీలేవో.. అనుకూల పార్టీలేవో చెప్తాం
  • మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్,వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు రెండు మూడు శాతం ఉన్న వాళ్లకు టికెట్లు ఇచ్చి.. 60 శాతం ఉన్న బీసీలను విస్మరించాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. జెండా మోసిన వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా జెండాను తాకట్టు పెట్టిన వాళ్లకే ఇచ్చాయని విమర్శించారు. ప్రజాసేవ చేసే వాళ్లకు కాకుండా, భూకబ్జాదారులకు, మద్యం వ్యాపారులకు టికెట్లు ఇస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.

శుక్రవారం దోమలగూడ లోని బీసీ కేంద్ర కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల రాజకీయ విధివిధానాలపై అధ్యయనం చేసి, భవిష్యత్​ కార్యాచరణ పై చర్చించడానికి ఈనెల 5న  హైదరాబాదులోని అశోకా హోటల్​ లో బీసీల రాజకీయ మేధోమదన సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో బీసీల రాజకీయ జెండా, ఎజెండా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. 33 జిల్లాల నుంచి  బీసీ శ్రేణులు, మేధావులు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.  ఈ సమావేశంలో  కుల్కచర్ల శ్రీనివాస్,తాటికొండ విక్రమ్ గౌడ్, కనకల శ్యాం కురుమ, గొడుగు మహేష్ యాదవ్, గూడూరు భాస్కర్ మెరు, ఇంద్రం రజక, జాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.