
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో యువత మద్యం, డ్రగ్స్ బారినపడటం ఆందోళనకరమని, ప్రభుత్వమే వీటిని నియంత్రించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సోషల్ మీడియా ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు ‘అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘నో డ్రగ్స్స్టేట్’ అంశంపై మాట్లాడారు. సమావేశానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన తెలంగాణ జన సమితి ప్రెసిడెంట్ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రం లిక్కర్ ఆదాయంతోనే నడుస్తోందని, టీఆర్ఎస్ పాలనలో లిక్కర్ అమ్మకాలు 300% పెరిగాయన్నారు. మద్యం కారణంగా నిరుపేద ఆర్థికంగా చితికిపోతున్నాడని, పేదోళ్లు బతుకుదెరువు కోసం తయారు చేసే మద్యానికి పర్మిషన్ ఇవ్వకుండా కేవలం పెద్ద కంపెనీలకు అనుమతి ఇస్తున్నారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దీని వెనుక విదేశీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రాష్ట్రంతో పాటు దేశంలోనూ విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ కేశవులు మాట్లాడుతూ.. కొన్ని దేశాలు భారత్‌పై మత్తు పదార్థాల రూపంలో దాడి చేస్తున్నాయని, 15 ఏండ్ల నుంచి 20 ఏండ్లలోపు యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నారన్నారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని అన్నారు. ఆప్ నేత ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. మద్యం, డ్రగ్స్ వల్లే నేరాలు పెరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమే అన్నారు. అనంతరం నో డ్రగ్స్ స్టేట్ బ్రోచర్‌ను రిలీజ్ చేశారు.