
-
వీసీల సమావేశంలో టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఈ విద్యాసంవత్సరం నుంచి పీజీ కోర్సుల అడ్మిషన్లలో స్పోర్ట్స్ కోటాను అమలు చేయనున్నట్టు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 21కి యూజీసీ గైడ్‌లైన్స్ కు తగ్గట్టుగా మార్పులు చేయనున్నట్టు చెప్పారు.
శుక్రవారం (సెప్టెంబర్ 12) టీజీసీహెచ్ఈ ఆఫీసులో వీసీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని వర్సిటీల పరిధిలో సుమారు 80– 90 శాం బయోమెట్రిక్/ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలు అవుతోందని, త్వరలో అన్ని కాలేజీల్లోనూ దీన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.
దశలవారీగా ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ సబ్జెక్టులకు ఎక్స్ పర్ట్స్‌తో తయారు చేయించిన సిలబస్‌ను అన్ని వర్సిటీల్లో అమలు చేయాలని తీర్మానం చేశారు. ఇంగ్లిష్ లాంగ్వేజీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు తయారు చేసిన ఇంగ్లిష్ సబ్జెక్టులనూ అన్ని వర్సిటీలు అమలు చేయాలని నిర్ణయించారు. టీచర్లకు హ్యాండ్ బుక్, విద్యార్థులకు వర్క్ బుక్ ఇవ్వనున్నట్టు కౌన్సిల్ అధికారులు తెలిపారు.
ఏఐసీటీఈ, బార్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్ ఇలా అన్ని సంస్థలూ అటెండెన్స్75 శాతం ఉండాలని నిర్ణయించాయని.. దాన్ని అన్ని సంస్థలూ అమలు చేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశం, ఇతర వీసీలు పాల్గొన్నారు.