ట్రాఫిక్ ఉల్లంఘనలపై తమిళనాడు ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు.. రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం కఠిన చర్యలు చేపట్టింది. మోటారు వాహనాల చట్టంలో కేంద్రం చేసిన సవరణల మేరకు.. తమిళనాడులో కొత్త రోడ్డు భద్రతా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు స్పాట్ ఫైన్లు విధించాలని నిర్ణయించింది.
భారీగా జరిమానా పెంపు
అంబులెన్స్‌కు దారివ్వకుండా, హారన్ మోగిస్తూ వేగంగా వాహనాలను నడిపితే రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రోడ్లపై పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపేవారికి తొలిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.10వేలు జరిమానా విధిస్తామని వివరించారు. వాహనాలను నడిపేందుకు అర్హత లేనివారు ( వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ) వాహనం నడిపితే తొలిసారి రూ.1000, రెండోసారి పట్టుబడితే రూ.2000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. సక్రమంగా రిజిస్ట్రేషన్ నెంబర్లు లేకుండా వాహనాలు నడిపేవారికి రూ.2500, రెండోసారి పట్టుబడితే రూ.5000 చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కార్లు తదితర వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.5000, రెండోసారి పట్టుబడితే రూ.10వేలు జరిమానా వసూలు చేస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి రూ.1000, రెండోసారి కూడా ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే రూ.4000 ఫైన్ వేయనున్నారు.
ప్రభుత్వం ఉత్తర్వులు
ఈ మేరకు స్పాట్ ఫైన్లను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ, రాష్ట్రాల అంతటా వాహనాల సంఖ్య పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా జరిమానా పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. 2019లో మోటారు వాహనాల సవరణ చట్టాన్ని కేంద్రం రూపొందించింది.
