
స్పై యూట్యూబర్ జ్యోతి మాలోహోత్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని ఒప్పుకున్నట్లు , ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. 2023లో పాకిస్తాన్‌కు వెళ్లడానికి వీసా కోసం హైకమిషన్ కు వెళ్ళినప్పుడు తాను మొదటిసారి డానిష్ అలియాస్ ఎహ్సార్ దార్‌ను కలిశానని తెలిపింది జ్యోతి.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత మే 13న ఇండియా బహిష్కరించిన దౌత్యవేత్తల్లో డానిష్ కూడా ఉండటం గమనార్హం.ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జ్యోతికి దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటన సందర్భంగా డానిష్ ఫ్రెండ్ అలీ హసన్‌ను కలిశానని.. అతనే తనకు బస, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేశాడని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ నిఘా అధికారులుగా భావిస్తున్న షకీర్, రాణా షాబాజ్‌లకు అలీ హసన్ తనను పరిచయం చేశాడని జ్యోతి తెలిపినట్లు సమాచారం.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి తన ఫోన్‌లో 'జట్ రాధావా' అనే మారుపేరుతో షకీర్ నంబర్‌ను సేవ్ చేసినట్లు తెలిపింది జ్యోతి. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత వాట్సాప్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాకిస్తాన్ ఇంటెల్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగించినట్లు తెలిపింది జ్యోతి.
కాగా.. జ్యోతి మల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో కొన్ని కీలక విషయాలను జ్యోతి మల్హోత్రా రాసుకుంది. ఆమె ఆలోచనలను, బార్డర్ దాటి పాకిస్తాన్ ట్రిప్కు వెళ్లొచ్చాక పాకిస్తాన్ ఆతిథ్యంపై జ్యోతి పొగడ్తలు కురిపించింది. పాకిస్తాన్ విజిట్ గురించి మాటల్లో చెప్పలేనని తన డైరీలో రాసుకొచ్చింది.
పది రోజుల పాటు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ట్రిప్ సాగింది. అయితే.. ఆమె తన డైరీలో పాకిస్తాన్ విజిట్ గురించి రాసుకొచ్చినప్పటికీ తేదీని ఎక్కడా ప్రస్తావించలేదు. భారత్లోని హిందువులు పాకిస్తాన్లోని తమ పూర్వీకుల ప్రదేశాలను సందర్శించాలని ఆమె రాసుకొచ్చింది. పాకిస్తాన్, చైనా దేశాలను ఆమె విజిట్ చేసినట్లు విచారణలో తేలింది. తనకు ఢిల్లీకి వెళుతున్నానని చెప్పిందని, పాకిస్తాన్ అని తమకు చెప్పలేదని జ్యోతి తండ్రి మీడియాకు చెప్పారు. పహల్గాం దాడి జరగడానికి 3 నెలల ముందే ఆ ప్రాంతానికి జ్యోతి వెళ్లినట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి.