రాజస్థాన్ vs ఆరెంజ్ ఆర్మీ మధ్య హై-ప్రెజర్ పోరు.. పిచ్ రిపోర్ట్, వాతావరణం ఇదే!

రాజస్థాన్ vs ఆరెంజ్ ఆర్మీ మధ్య హై-ప్రెజర్ పోరు.. పిచ్ రిపోర్ట్, వాతావరణం ఇదే!

SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట్లో జరగనున్న హై-ప్రెజర్ 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు పోటీపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళ్లనుండగా, గెలిచిన టీమ్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో మరోసారి  తలపడనుంది.  

ముల్లాన్‌పూర్ పిచ్ రిపోర్ట్: 
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముల్లాన్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ జరిగిన పలు మ్యాచ్‌ల్లో 200+ స్కోర్లు ఈజీగా నమోదు అయ్యాయి. ఈ పిచ్‌పై మంచి బౌన్స్, క్యారీ అవడంతో బ్యాటర్లు నమ్మకంతో షాట్లు ఆడవచ్చు.. ఇక్కడి ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా బౌండరీలు సులభంగా లభిస్తాయి. కానీ, కొత్త బంతితో స్వింగ్ చేయగల పేసర్లకు పవర్‌ప్లేలో వికెట్లు దక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కొత్త బంతితో కాస్త మూవ్‌మెంట్ లభిస్తుంది. అలాగే డెత్ ఓవర్లలో మంచి వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు మాత్రమే ఇక్కడ ప్రభావం చూపిస్తారు.

చండీగఢ్ వాతావరణం: 
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఎటువంటి వర్షం ముప్పు లేనప్పటికీ, ఆటగాళ్లకు తీవ్రమైన ఎండ సవాలుగా మారనుంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి చండీగఢ్‌లో ఉష్ణోగ్రత దాదాపు 41.1°C గా ఉండే ఛాన్స్ ఉంటుంది. హ్యుమిడిటీ (తేమ) చాలా తక్కువగా అంటే 12శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆకాశం పూర్తిగా క్లియర్‍గా ఉండటంతో.. పవర్‌ప్లే సమయంలో తేలికపాటి గాలులు పేసర్లకు స్వల్పంగా కలిసిరావచ్చు, కానీ ఓవరాల్‌గా కండిషన్స్ అన్నీ బ్యాటింగ్‌కే పూర్తి అనుకూలంగా ఉన్నాయి.

విధ్వంసకర ఓపెనర్లు: 
ఈ పిచ్ కండిషన్స్ ఇరు జట్లలోని పవర్‌ఫుల్ బ్యాటింగ్ యూనిట్లకు బాగా సెట్ అవుతుంది. సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పవర్‌ప్లేలోనే చెలరేగిపోయే అవకాశం ఉండటంతో పాటు రాజస్థాన్ జట్టు యశస్వి జైస్వాల్‌తో పాటు యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ఆశలు పెట్టుకుంది. కొత్త బంతితో సన్‌రైజర్స్ ఓపెనర్లను దెబ్బకొట్టాలని జోఫ్రా ఆర్చర్‌ను బరిలోకి దించాలని రాజస్థాన్ ప్లాన్ వేయగా, ఆర్ఆర్ ఓపెనర్లని కట్టడి చేయాలని ఆరెంజ్ ఆర్మీ చూస్తుంది.