కృష్ణుడి పండుగ పిల్లలతో.. 

కృష్ణుడి పండుగ పిల్లలతో.. 

కన్నయ్య పుట్టిన రోజంటే ఊరూవాడా గోకులాన్ని తలపిస్తాయి. ప్రతి ఇల్లూ చిన్ని కృష్ణుడి పాదాలతో వెల్​కం చెప్తుంది. ఆ వన్నెచిన్నెల కృష్ణుడిని..  తమ బిడ్డలో చూసుకుంటూ ప్రతి తల్లీ మురిసిపోతుంది. అచ్చం కన్నయ్యలా రెడీ చేస్తే... ఆ బాలగోపాలుడే కళ్లముందుకొచ్చినట్టు ఉంటుంది. అలాగే పాపాయిల్ని  బంగారు బొమ్మ రాధమ్మలా ముస్తాబు చేస్తే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలా రెడీ అయిన ఈ బుల్లి రాధాకృష్ణుల్ని చూస్తుంటే మనసు నిండిపోతుంది కదూ!

కృష్ణుడి పండుగ పిల్లలతో.. 

అల్లరి కృష్ణుడు పుట్టినరోజు  పిల్లలకూ పెద్ద పండుగే. బాలకృష్ణుడు చేసిన అల్లరి ఈ పిల్లలకు తెలియాలంటే వాళ్లతో కొన్ని యాక్టివిటీస్ చేయించాలి.జన్మాష్టమిని పిల్లలతో సెలబ్రేట్ చేయడం ద్వారా పిల్లలకు కృష్ణుడి కథలు తెలియడంతో పాటు, వాళ్లలో ఉన్న క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. జన్మాష్టమి రోజు పిల్లల్ని పోగుచేసి, వారికి క్రాఫ్ట్ మేకింగ్ కాంపిటీషన్ పెట్టొచ్చు. దానికంటే ముందుగా పిల్లలకు కృష్ణుడు, గోపికలు ఎలా ఉంటారో చెప్పి అలాంటి బొమ్మలు తయారుచేయించాలి. 

బృందావనం

ఈ రోజున పిల్లలతో బృందావనాన్ని రెడీ చేయించొచ్చు. బృందావనం ఎలా ఉంటుందో చెప్పి క్రాఫ్ట్స్ సాయంతో దాన్ని తయారుచేయమనాలి. తెల్లటి చార్ట్‌‌ మీద మట్టి పరిచి దానిపై చిన్నచిన్న మొక్కలు, గడ్డి  అమర్చాలి. వాటి మధ్యలో ఒక పెద్ద మొక్క ఉంచి దాని కింద  వేణువు ఊదుతున్న కృష్ణుడి బొమ్మను ఉంచాలి. తర్వాత కృష్ణుడి చుట్టూ గోపికల బొమ్మలు, ఆవులు, జింకలు, నెమళ్ల బొమ్మలు పెట్టాలి.  పిల్లలకు బృందావనం ఎంత అందంగా ఉంటుందో, కృష్ణుడు బృందావనంలో ఏమేం చేసేవాడో కథల రూపంలో వివరించాలి.  

ఉట్టిలో స్వీట్స్ 


ఇక చివరిగా పిల్లలకు ఇంట్లోనే ఉట్టి పోటీని పెట్టొచ్చు. ఒక మట్టి కుండను తీసుకుని అందులో స్వీట్స్, చాక్లెట్స్‌‌ ప్యాక్ చేసి పెట్టాలి. ఆ కుండకు చుట్టూ తాడుని కట్టి హైట్ అడ్జస్ట్ చేసేలా గాలిలో వేలాడదీయాలి. పిల్లలకు కృష్ణుడి వేషం వేసి, చేతికి కర్రలు ఇవ్వాలి. ఉట్టి కొట్టిన తర్వాత అందులోనుంచి కింద పడే స్వీట్స్, చాక్లెట్స్​ను పిల్లలకు పంచిపెడితే వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.

గోవర్ధన గిరి


కృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తిన సన్నివేశాన్ని కూడా పిల్లలతో రీక్రియేట్ చేయించొచ్చు. ఒక పెద్ద చార్ట్ తీసుకుని దానిపై పెద్దపెద్ద కొండలు గీయాలి. ఈ చార్ట్‌‌ను బ్యాక్ గ్రౌండ్‌‌లా వాడాలి. తర్వాత కింద మరో చార్ట్ ఉంచి, దానిపై కొంచెం గడ్డి వేయాలి. మధ్యలో  కృష్ణుడి బొమ్మను ఉంచి దానిపై మట్టితో చేసిన గోవర్ధన గిరిని ఉంచాలి. ఈ బొమ్మల ద్వారా పిల్లలకు గోవర్ధన గిరి కథను చెప్పొచ్చు.