శ్రీలంకలో ఎమర్జెన్సీ.. రంగంలోకి దిగిన ఆర్మీ

శ్రీలంకలో ఎమర్జెన్సీ.. రంగంలోకి దిగిన ఆర్మీ

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని రణిల్‌ విక్రమసింఘే దేశంలో ఎమర్జెన్సీని (అత్యవసర పరిస్థితిని) ప్రకటించారు. గొటబయ రాజపక్స దేశం నుంచి పారిపోవడంతో.. తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొలంబోలోని అధ్యక్ష నివాసం వద్ద ఆందోళన సృష్టించారు. దీంతో ఆర్మీ సైతం రంగంలోకి దిగి... కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిరసనకారులు లోనికి చొచ్చుకురావడంతో.. సైనికులు భాష్ప వాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసుల వాహనాలపైకి రాళ్లు రువ్వగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు.

శ్రీలంకలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రధాని గొటబయ నివాసం వద్ద మిలిటరీ దళాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు పరారీకి అధికారులు సహకరించారని ఆరోపించిన ఆందోళనకారులు.. ప్రధాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే అధ్యక్ష నివాసం వద్ద ఆందోళన చేసేందుకు.. వేల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్ల పైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.