శ్రీలంకలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు పెంపు

 శ్రీలంకలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు పెంపు

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇంధన కొరత కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో అదనంగా ఒకరోజు సెలవును పొడిగించింది. రాబోయే మూడు నెలల పాటు ప్రతి శుక్రవారం సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో వ్యవసాయం చేసి ఆహార కొరతను అధిగమించేలా సహకరించాలని అధికారులు సూచించారు. ద్వీప దేశంలోని ప్రభుత్వ రంగంలో దాదాపు పది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.   విదేశీ మారకద్రవ్యం కొరతతో ఇంధనం, ఆహారం, ఔషధాలు దిగుమతుల కోసం చెల్లించడానికి  కష్టమవుతుంది. దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలలో చాలా మంది పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది. గత కొన్ని నెలలుగా  సుదీర్ఘ విద్యుత్ కోతలను భరిస్తున్నారు.