చింతిస్తున్నాం.. జైషాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన శ్రీలంక ప్ర‌భుత్వం

 చింతిస్తున్నాం.. జైషాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన శ్రీలంక ప్ర‌భుత్వం

జై షా వల్లే శ్రీలంక క్రికెట్‌ నాశనం అయ్యింది.. అతను చాలా పవర్‌ఫుల్ మనిషి. ఎందుకంటే అతని తండ్రి భారత్ దేశానికి హోమ్ మినిస్టర్.. అంటూ రెండ్రోజుల క్రితం బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా తనయుడిపై లంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై శ్రీలంక ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. 

శనివారం పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా ఈ విషయంపై స్పందించిన మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేశేఖ‌ర‌లు విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం త‌రుపున జైషాకు క్ష‌మాప‌ణ‌లు చెప్తున్న‌ట్లు తెలిపారు. "మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులు జై షాకు క్షమాపణలు చెప్తున్నాం.. మా బోర్డులోని లోపాలను ఇతర దేశాలపై రుద్దలేము. ఇది సరైన పద్దతి కాదు.." అని మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు.

గతంలో ఏం జరిగిందంటే..?

భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 శ్రీలంక జట్టు దారుణంగా విలమైంది. 9 మ్యాచ్ ల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. చివరికి అఫ్ఘనిస్తాన్ చేతిలోనూ పరాజయం పాలైంది. ఈ  టోర్నీలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో లంకేయులు 55 పరుగులకే కుప్పకూలగానే..  శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే శ్రీలంక క్రికెట్ బోర్డు కార్య‌వ‌ర్గాన్ని రద్దు చేశారు. అనంతరం ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్‌షాకిచ్చింది. 

స్వయం ప్రతి పత్తి కలిగిన శ్రీలంక క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ ఆ జట్టును సస్పెండ్ చేసింది. ఈ వరుస ఘటనలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రణతుంగ.. శ్రీలంక క్రికెట్‌ కు ఈ పరిస్థితి రావడానికి కారణం జై షానే అని ఆరోపించారు.  అతడు భారత్‌లో ఉంటూనే శ్రీలంక బోర్డు‌ను సర్వనాశనం చేశాడని నిందలు వేశాడు.