మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

కొలంబో:  శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంతో అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. సైనిక విమానంలో భార్య, ఇద్దరు బాడీగార్డులతో కలిసి గొటబయ మాల్దీవులకు పారిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇక ప్రజల నిరసనల నేపథ్యంలో రాజీనామాన చేస్తానని గొటబయ ఇప్పటికే ప్రకటించారు. అయితే తనకు గొటబయకు సంబంధించిన రాజీనామా లెటర్ ఇంకా అందలేదని స్పీకర్ చెబుతున్నారు.   శ్రీలంక ఆర్ధిక శాఖ మంత్రి, గొటబయ సోదరుడైన బాసిల్ రాజపక్స కూడా దేశం విడిచి పారిపోయారు. గొటబయ దేశం విడిచి పారిపోయేందుకు భారత్ సహకరించిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలంకలోని భారత హైకమిషన్ అధికారులు స్పష్టం చేశారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు.

అధ్యక్షుడి హోదాలో ఉన్నందున తనను అరెస్ట్ చేయడం కుదరదని, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశం విడిచి పారిపోవాలని గొటబయ భావించినట్లు తెలస్తోంది. ఇక బుధవారం తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు గొటబయ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. విపక్ష పార్టీలైన ఎస్‌జేబీ, ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు విపక్ష నేతలు ప్రయత్రాలు ముమ్మరం చేశారు.