ఈ సారైనా రివర్స్​ పంపింగ్​ ఉంటదా? 

ఈ సారైనా రివర్స్​ పంపింగ్​ ఉంటదా? 

నాలుగేళ్లుగా సాగుతున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం
నిజామాబాద్, వెలుగు: గోదావరిపై మహారాష్ట్ర కట్టిన అక్రమ ప్రాజెక్టుల కారణంగా వట్టిపోతున్న నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ను నింపి, 15 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం’ పనులు లేట్​ అవుతున్నాయి. గడిచిన నాలుగేండ్లలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.932 కోట్లు పెరిగినా నేటికీ పూర్తికాలేదు. ఇంకా మూడో లిఫ్టు పనులు పెండింగ్​లో ఉండగా, ఈ ఏడాది కూడా రివర్స్ ​పంపింగ్​ జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. 
20 ఏళ్ల సగటు 54 టీఎంసీలే.. 
ఎస్సారెస్పీ​ స్టోరేజీ కెపాసిటీ 90.31 టీఎంసీలు కాగా, గడిచిన 20 ఏళ్లలో సగటున 54 టీఎంసీల నీళ్లు మాత్రమే ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. మహారాష్ట్ర కట్టిన ప్రాజెక్టుల కారణంగా ఒకానొక దశలో శ్రీరాంసాగర్​ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రాజెక్టు స్టేజ్‌‌-1, 2 కింద ఉన్న సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టులో సగం కూడా పారని పరిస్థితి వచ్చింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం కాళేశ్వరం నుంచి తీసుకునే నీటిలోంచి 60 టీఎంసీలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017 జూన్‌‌‌‌17న రూ.1,067 కోట్ల అంచనాతో ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం’ మంజూరు చేసింది.ఈ పనులను నవయుగ ఇంజనీరింగ్‌‌‌‌ కంపెనీ దక్కించుకుంది.
వరద కాలువ ద్వారా..
ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా, కాళేశ్వరం నుంచి మిడ్​మానేరు తరలించే 2 టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని వరద కాలువ ద్వారా 60 రోజులపాటు ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయాలని నిర్ణయించారు. జగిత్యాల జిల్లాలోని రాజేశ్వర్​రావు పేట, మెట్​పల్లి మండలం రాంపూర్, నిజామాబాద్​ జిల్లాలోని ముప్కాల్ వద్ద​మూడు లిఫ్టులు ఏర్పాటు చేసేలా డిజైన్‌‌ చేశారు. ఇందుకోసం మూడు దశల్లో పంపుహౌస్​​లను ప్రతిపాదించారు. వాటి వద్ద మూడు క్రాస్‌‌ ‌‌రెగ్యులేటర్ల ఏర్పాటుతోపాటు వరద కాలువ కట్ట బలోపేతం, బలహీనంగా ఉన్నచోట రిపేర్లు చేయాలి. పంపుహౌస్‌‌‌‌లకు నీటిని తరలించేందుకు అప్రోచ్‌‌ ‌‌చానళ్లు.. ఒక్కో పంపుహౌస్‌‌‌‌లో 6.5 మెగావాట్ల కెపాసిటీ ఉండే 8 మోటార్లు, డెలివరీ మెయిన్స్‌‌‌‌, డెలివరీ సిస్టర్న్‌‌‌‌, లీడ్‌‌‌‌చానల్‌‌‌‌, ఎలక్ట్రో మెకానికల్‌‌‌‌, హైడ్రో మెకానికల్‌‌‌‌, ఇన్‌‌‌‌ఫాల్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌, డెలివరీ సిస్టర్న్‌‌‌‌లకు అడ్డంగా డీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ బ్రిడ్జిలు నిర్మించాలి. 
పెరిగిన అంచనా వ్యయం..
2017 జూన్‌‌లో  పరిపాలనా అనుమతులు రాగా,15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  కానీ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం టెండర్ల ప్రక్రియ మొదలైన ఆరు నెలలకే డిజైన్‌‌లో మార్పులు చేశారు. ఈ సమయంలోనే అంచనా వ్యయాన్ని రూ.1,067 కోట్ల నుంచి..  రూ.1,751.46 కోట్లకు పెంచారు. తర్వాత పనులు వేగంగా కొనసాగాయి.  మూడు పంపుహౌజ్‌‌ల నిర్మాణం పూర్తయింది. ఇరిగేషన్‌‌ శాఖ లెక్కల మేరకు.. ఇప్పటికే ప్రాజెక్టు పై  రూ.1,700 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పనులు 90 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఈ క్రమంలో ప్రాజెక్టు ఇంజనీర్లు మరోమారు అంచనాలను సవరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.1,999.55 కోట్లతో ఈ ప్రతిపాదనలు వెళ్లినట్టు తెలిసింది. అంటే తొలి అంచనాతో పోలిస్తే ఏకంగా రూ.932 కోట్లు వ్యయం పెరిగినట్టు స్పష్టమవుతోంది.
వర్షాలు పడకుంటే..
ముందుగా అనుకున్న ప్రకారం 2018 ఆగస్టు వరకు పునరుజ్జీవ పథకం నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పనులు నిలిచిపోతున్నాయని ఆఫీసర్లు అంటున్నారు. నిజానికి 2020 జులై కల్లా పనులు పూర్తి చేసి రివర్స్ ​పంపింగ్ ​స్టార్ట్​ చేస్తామని సర్కారు చెప్పింది. కానీ ఈ ఏడాది జూన్​ వచ్చినా ఇంకా పనులు పూర్తికాలేదు. జగిత్యాల జిల్లాలోని రాజేశ్వర్​పేట, మెట్​పల్లి మండలం రాంపూర్​ వద్ద ఫస్ట్, సెకండ్​ లిఫ్టు పనులు పూర్తయినా నిజామాబాద్ ​జిల్లా ముప్కాల్​జీరో పాయింట్ వద్ద  మూడో పంప్ ​పనులు ఇంకా పెండింగ్​లో ఉన్నాయి. రూ.175 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉండడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా, రెండేళ్ల నుంచి ఎస్సారెస్పీ పూర్తిస్థాయిలో నిండడంతో రివర్స్​ పంపింగ్​అవసరం రాలేదు. కానీ ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 23.939  టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నందున ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడకుంటే... రివర్స్​ పంపింగ్​ అవసరం పడుతుంది. ఒకవేళ చేయలేకపోతే పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లివ్వడం కష్టమవుతుంది.

పనులు స్పీడ్​ చేయాలె 
రెండేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్, లిఫ్టులు పూర్తి చేసి ఎస్సారెస్పీ నింపుతామని సర్కారు చెప్పింది. నాలుగేండ్లు దగ్గర పడుతున్నా ఇంకా  పనులు పూర్తయితలేవు. ఇప్పటికీ ఎస్సారెస్పీలోకి  నీళ్లు పంపింగ్ చేస్తలేరు. వర్షాలు పడి ఎస్సారెస్పీ నిండితే ఫర్వాలేదు. లేదంటే కష్టం. లేట్​ చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని స్పీడప్​ చేయాలె. ఈసారి ఎట్లన్న ట్రయల్​ రన్​ చేయాలె.                                                                                                      - ఏలేటి విజయ్​రెడ్డి,  రైతు, నిజామాబాద్​

ఈసారి పంపింగ్​ స్టార్ట్​ చేస్తాం
ఎస్పారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు దాదాపు పూర్తయ్యా యి. మూడు లిఫ్టుల కు సంబంధించిన పంప్ ​హౌజ్ నిర్మాణ పనుల్లో 90 శాతం కంప్లీట్​ చేశాం. జీరో పాయింట్​ వద్ద మూడో పంప్​ హౌస్​​లో ఆరు పంప్​లు పూర్తయ్యాయి.  మరో రెండు పంప్​ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వర్క్స్​కు సంబంధించి రూ.175 కోట్ల  బిల్లుల పెండింగ్​లో ఉన్నాయి. అందువల్లే పనులు లేట్ ​అవుతున్నాయి.                                                                        - సుధాకిరణ్, పునరుజ్జీవ పథకం ఈఈ