ఢిల్లీలో బీజేపీ పెద్దలకు సాగిలపడడం కేటీఆర్‌‌కు అలవాటే : మంత్రి శ్రీధర్ బాబు

ఢిల్లీలో బీజేపీ పెద్దలకు సాగిలపడడం కేటీఆర్‌‌కు అలవాటే : మంత్రి శ్రీధర్ బాబు
  •     బీఆర్ఎస్ కొట్టేవి సోషల్ మీడియా సిక్సర్లే.. మేం ప్రజాక్షేత్రంలో కొడుతున్నం: మంత్రి శ్రీధర్​ బాబు 
  •     బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి 
  •     సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారరు.. ఆయన మాకు పెద్ద అసెట్ అని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమైందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం నేరుగా ప్రజాక్షేత్రంలోనే సిక్సర్లు కొడుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘‘బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో సిక్సర్లు కొడ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోనే సిక్సర్లు కొట్టి చూపించింది’’ అన్నారు.  సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్.. బాధ్యతాయుతంగా శాసనసభకు హాజరైతే బాగుంటుందని ఆయన హితవు పలికారు. కేటీఆర్ అబద్ధాలతో గారడీ చేస్తూ ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించేలా 70 ఎంఎం సినిమా చూపించాలని చూశారని.. కానీ, ప్రజలు వాటన్నింటినీ నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. 

ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు సాగిలపడడం కేటీఆర్‌‌కు అలవాటేనని,  కోట్లు ఆయన తీసుకెళ్లి ఇచ్చారేమో.. ఇప్పుడు అదే భావతో  తమను అంటున్నారన్నారు. తమ బాస్ ఏఐసీసీ అని వారు పిలిచినప్పుడే తాము ఢిల్లీ వెళ్తామన్నారు. తమ సొంత ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిని బరిలో దించలేకపోయిందని ఎద్దేవా చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.15 వేల కోట్ల బకాయిలు గత ప్రభుత్వ పాపమేనని, త్వరలోనే రాష్ట్రంలో పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తా మని ప్రకటించారు. ప్రభుత్వ ఆస్తులైన సింగరేణిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, పెండింగ్‌‌లో ఉన్న అసెంబ్లీ ఫ్లోర్ కమిటీలతో పాటు ఖాళీగా ఉన్న కార్పొ రేషన్ చైర్మన్లను అతి త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. 

గ్లోబల్ సదస్సు పెట్టుబడులపై వైట్ పేపర్ విడుదల చేస్తం 

గ్లోబల్  సదస్సులో జరిగిన ఒప్పందాలపై వైట్ పేపర్  రిలీజ్  చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్  బాబు ప్రకటించారు. మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులపై  ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇందులో సుమారు 40 శాతం వరకు గ్రౌండ్  అయ్యాయన్నారు. మంగళవారం అసెంబ్లీలో గ్లోబల్  సదస్సు ఒప్పందాలపై గవర్నర్  స్పీచ్​లో తప్పుడు లెక్కలు ఇచ్చారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్  చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఫార్మా సిటీ అంశంపై రైతుల ఇబ్బందులు తెలుసుకోవటానికి భట్టి పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 

అదే ఏరియాలో గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇదే అంశాన్ని హైకోర్టుకు తెలిపామని మంత్రి వెల్లడించారు. 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని శ్రీధర్ బాబు తేల్చిచెప్పారు. ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఆశించని ఆయనకు కేవలం స్థానికంగానే కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సామరస్యంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో పాటు తాను కూడా ఆయనతో స్వయంగా మాట్లాడుతానని వెల్లడించారు.