మేం మస్తు చేసినం.. ప్రజలే ఎక్కువ కోరుకున్నరు : శ్రీనివాస్‌ గౌడ్‌

మేం మస్తు చేసినం..  ప్రజలే ఎక్కువ కోరుకున్నరు : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు తమ ప్రభుత్వం చాలా చేసిందని, అయితే ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, భవిష్యత్‌లో ప్రభుత్వానికి మొసళ్ల పండగేనని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పాలమూరు అభివృద్ధి గురించి రేవంత్ చెప్పినవన్నీ అవాస్తవాలేనన్నారు. 

అబద్ధాలను ప్రచారం చేయడం ఆపి, జిల్లా నుంచి సీఎం అయినందుకు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించినట్టే, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్‌ పరిశీలనకు మీతో పాటు తమ పార్టీ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

 కొడంగల్ ఎత్తిపోతలపై పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జూరాల నుంచి నీటి తరలింపు సాధ్యమయ్యే పనేనా ఆలోచించాలన్నారు. కర్నాటక ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాలను ప్రారంభిస్తే జూరాలకు నీరు అందే పరిస్థితి ఉండదన్నారు. పాలమూరు ప్రాజెక్టులో 15 శాతమే పనులు పెండింగ్‌లో ఉన్నాయని, నాలుగు నెలల్లో వాటిని పూర్తి చేయొచ్చని.. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలని కోరారు.