- ప్రాజెక్టు వ్యయం రూ.7,700 కోట్లు..
- రూ.5 వేల కోట్లకుపైగా భరించాల్సింది కేంద్రమే
- ప్రాజెక్టులో మూడోవంతు ఖర్చుకే రాష్ట్ర కేబినెట్ ఆమోదం
- కేంద్ర ప్రభుత్వానికి చేరిన ఫైల్
- సెంట్రల్ కేబినెట్ ఆమోదిస్తేనే ప్రాజెక్టు ముందుకు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ విషయం ఇక కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఈ ప్రాజెక్టుకు రూ.7,700 కోట్ల వ్యయం కానుండగా, ప్రత్యక్షంగా రూ.2,500 కోట్లు ఖర్చుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో పాటు17% నిర్మాణ సామగ్రి, పన్నుల మినహాయింపు, ఇతరత్రా ఖర్చులు భరించేందుకు సిద్ధమని ఇటీవల జరిగిన కేబినెట్భేటీలో వెల్లడించింది. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో ఈ ఫైల్ కేంద్రానికి చేరింది.
అక్కడ ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరి అని ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు చెబుతున్నారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) ఏరియాలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పర్యావరణ, అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఎన్ని రోజులు పడుతుందనే విషయాన్ని ఎన్హెచ్ఏఐ ఇంజినీర్లు చెప్పలేకపోతున్నారు. 54.9 కి.మీ. దూరం నిర్మించే ఈ ప్రాజెక్టులో రూ.3,850 కోట్లకు పైగా నిధులను కేంద్రం భరించాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం నుంచి ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తేనే ముందుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
45 కి.మీ. దూరం ఎలివేటెడ్ కారిడార్..
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు 765 నేషనల్ హైవే రోడ్డు ఇదివరకే ఉంది. ఇది మొత్తం 213 కి.మీ. దూరం ఉంటుంది. ఇందులో 121వ కి.మీ. నుంచి 191వ కి.మీ. వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో దాదాపు 70 కి.మీ. దూరం ఘాట్ రోడ్డు ఉంటుంది. అటవీ, పర్యావరణ పరిమితుల కారణంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయడం సాధ్యం కావడంలేదు. ప్రస్తుతం ఈ రిజర్వ్ ఫారెస్ట్‌లో పగటిపూట మాత్రమే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ఈ నేపథ్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కొత్తగా 54.915 కిలోమీటర్ల దూరం ఫోర్ లేన్ రోడ్డు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని ఈగలపెంట దగ్గర ముగిసే ఈ రోడ్డులో 83 శాతం అంటే 45.42 కి.మీ. దూరం ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఫ్లై ఓవర్ మాదిరిగా నిర్మించనుండటంతో దీనికింద వన్యప్రాణులు ఎలాంటి ఆటంకం లేకుండా సంచరించే అవకాశం ఉటుంది.
మిగిలిన 9.495 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణం చేపడతారు. అలాగే ఆంధ్ర వైపు కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ రూ.7,700 కోట్లు కాగా, ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ డీపీఆర్ రెడీ చేసింది. ఈ కారిడార్ పూర్తయితే శ్రీశైలానికి రాత్రిపూట ప్రయాణం సాధ్యమవుతుంది. ఘాట్ రోడ్డు కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలకూ చెక్పడ్తుంది. రోడ్డు ప్రమాదాల్లో అటవీ జంతువుల మరణాలనూ అడ్డుకోవచ్చని సర్కారు భావిస్తోంది.
2022–23 నుంచే ప్రతిపాదనలు..
ఈ ప్రాజెక్టుకు 2022–23 వార్షిక ప్రణాళికలో ప్రతిపాదనలు పెట్టారు. హైదరాబాద్–శ్రీశైలం మధ్య అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియాలో 24/7 వెహికల్స్ రాకపోకలు సాగించడానికి, వణ్యప్రాణులకు హాని కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పనులు చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను స్టడీ చేయాలని ఓ ప్రైవేట్ ఏజేన్సీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. రెండేళ్లు శ్రమించిన కన్సల్టెన్సీ సంస్థ 54.9 కి.మీ. దూరం కొత్త రోడ్డుకు ప్రపోజల్ చేసింది.
ఇందులో 45.42 కి.మీ. దూరం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని పేర్కొంటూ డీపీఆర్ రెడీ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. సెప్టెంబర్ 9న ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా ఉన్నందున ఆర్థికంగా సాధ్యం కాదని కేంద్ర మంత్రి చెప్పగా.. ప్రాజెక్టు ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం రేవంత్ అంగీకరించారు.
కేంద్రం ఆమోదమో తరువాయి..
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పుకున్న ప్రకారం 50 శాతం నిధులు ఖర్చుచేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 33 శాతం నిధులు సుమారు రూ.2,500 కోట్లు రోడ్ల నిర్మాణం కోసం, మిగతా 17 శాతం నిధులను పరోక్ష పద్ధతిలో ఖర్చుచేస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆమోదం లభించడంతో ఈ ఫైల్‌ను ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. 50 శాతం వాటా కేంద్రం చెల్లించాల్సి ఉన్నందున, కేంద్రం ఫైనాన్షియల్ అప్రూవల్ ఇస్తేనే ఈ ప్రాజెక్టుకు అడుగులు పడనున్నాయి.
ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాల వరకు తగ్గనుంది. వన్యప్రాణుల సంచారానికి ఆటంకాలు లేకుండా సురక్షిత , వేగవంతమైన ప్రయాణం వీలవుతుంది. తద్వారా శ్రీశైలం డ్యామ్, పుణ్యక్షేత్రం, ఫరహాబాద్ వ్యూ పాయింట్, టైగర్ సఫారీ వంటి పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
