Srisailam: శ్రీశైలం టూర్ గానీ ప్లాన్ చేస్తున్నారా.. ఇయ్యాల్టి తాజా పరిస్థితి ఇది.. ఇగ మీ ఇష్టం..

Srisailam: శ్రీశైలం టూర్ గానీ ప్లాన్ చేస్తున్నారా.. ఇయ్యాల్టి తాజా పరిస్థితి ఇది.. ఇగ మీ ఇష్టం..

శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం ప్రాజెక్టు గేట్లను ఎత్తిన నేపథ్యంలో ఆ అందాలను వీక్షించేందుకు సందర్శకులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. వీకెండ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా శ్రీశైలానికి సందర్శకులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందల కొద్దీ వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. రాత్రి సమయంలో కూడా సందర్శకుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. శ్రీశైలం జలాశయం సమీపంలో ఏ రేంజ్లో  ట్రాఫిక్ జామ్ అయిందో ఈ ఫొటో చూస్తే ఈపాటికే అర్థమై ఉంటుంది. శనివారం రోజే ఇలా ఉందంటే ఇక ఆదివారం సందర్శకులు మరింత పెరిగే అవకాశం ఉంది.

వీకెండ్ కావడంతో హైదరాబాద్ నగరం నుంచి ఐటీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగాలు చేసే ఉద్యోగులు శ్రీశైలానికి ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో భారీగా శ్రీశైలానికి తరలి వెళుతుండటంతో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. శ్రీశైలంకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ పెరగడంతో మూలమలుపు నుంచి మన్ననూరు వరకు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. 10  గేట్లు 20 అడుగుల మేర ఎత్తి  4,64,740 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు అధికారులు వదులుతున్నారు.

 

శ్రీశైలం ప్రాజెక్ట్ అప్డేట్ :-

 

* శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ప్రవాహం. 

* 10  గేట్లు 20 అడుగుల మేర ఎత్తి  4,64,740 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్న అధికారులు.

* ఇన్ ఫ్లో :- 4,54,710 క్యూసెక్కులు

* ఔట్  ఫ్లో :-  5,26,501 క్యూసెక్కులు

* పూర్తి స్దాయి నీటిమట్టం :- 885 అడుగులు 

* ప్రస్తుతం  :-  883.30 అడుగులు

* పూర్తిస్థాయి నీటి నిల్వ :- 215.8070 టీఎంసీలు

* ప్రస్తుతం :- 204.7888 టీఎంసీలు

* కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

 

నల్లగొండ జిల్లా @ నాగార్జున సాగర్ ప్రాజెక్టు అప్డేట్ :-

 

*  శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి  కొనసాగుతున్న భారీ వరద.

* ఇన్ ఫ్లో :- 5,24,868 క్యూసెక్కులు

* ఔట్  ఫ్లో :- 39,741క్యూసెక్కులు

* పూర్తిస్థాయి నీటిమట్టం :- 590.00 అడుగులు.

* ప్రస్తుత నీటి మట్టం :- 565.00 అడుగులు.

* పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం :-   312.5050 టీఎంసీలు.

* ప్రస్తుత నీటి నిల్వ :- 244.1420 టీఎంసీలు.