- పులుల గణన సందర్భంగా నిర్ణయం
శ్రీశైలం, వెలుగు: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి నడకమార్గం ద్వారా వచ్చే భక్తులకు ఆత్మకూర్ టైగర్ డివిజన్ ప్రాజెక్ట్ డీడీ విఘ్నేశ్ కీలక సూచనలు చేశారు. వెంకటాపురం నుంచి హటకేశ్వరం వరకు పెచ్చెరువు-నాగలూటి మార్గం గుండా పాదయాత్రగా శ్రీశైలానికి వచ్చే భక్తులు ఆ మార్గం నుంచి రావద్దని ఆయన ప్రకటించారు. భక్తులు దోర్నాల రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
భారత్‌లోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో నాలుగేళ్లకోసారి నిర్వహించే అఖిల భారత పులుల గణనలో భాగంగా నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో సర్వే చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ టైగర్ రిజర్వ్‌లోని ఆత్మకూర్ డివిజన్ పరిధిలో ఫేజ్ 3 దశలో కెమెరా ట్రాప్ ద్వారా పులుల గణన ప్రారంభమైందన్నారు.
బ్లాక్-1 పరిధిలోని ఆత్మకూర్, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లలో పులుల లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 8 నుంచి 15వ వరకు వెంకటాపురం నుంచి హటకేశ్వరం వరకు, పెచ్చెరువు-నాగలూటి మార్గం గుండా పాదయాత్రకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
