V6 News

ఎస్సారెస్పీ కెనాల్‌‎కు బీఎన్‌‌‎ రెడ్డి పేరు పెట్టాలి: బీఎన్ ఆలోచనా వేదిక డిమాండ్

ఎస్సారెస్పీ కెనాల్‌‎కు బీఎన్‌‌‎ రెడ్డి పేరు పెట్టాలి: బీఎన్ ఆలోచనా వేదిక డిమాండ్

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ఎస్సారెస్పీ కెనాల్‌‎కు బీఎన్‌‌‌‌.రెడ్డి పేరు పెట్టాలని సీనియర్‌‌‌‌ ఎడిటర్లు డిమాండ్‌‌‌‌ చేశారు. ‘బీఎన్ ఆలోచనా వేదిక’ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో బుధవారం రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భీమిరెడ్డి నర్సింహారెడ్డి జ్ఞాపకాలు – ఎస్సారెస్పీ కాల్వ పేరు మార్పుపై సమాలోచనలు’ అంశంపై సీనియర్‌‌‌‌ ఎడిటర్లు వర్దెల్లి మురళి, కె.రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, కట్టా శేఖర్‌‌‌‌రెడ్డి, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. బీఎన్‌‌‌‌రెడ్డి ఎస్సారెస్పీ కాల్వ కోసం ఎంతో కృషి చేశారని, ఎస్సారెస్పీ రెండో దశ కాల్వకు కాంగ్రెస్‌‌‌‌ నేత దామోదర్‌‌‌‌రెడ్డి పేరు పెట్టడం సరైంది కాదని వర్దెల్లి మురళి అన్నారు. 

ఈ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం బీఎన్‌‌‌‌రెడ్డి ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా, అటు పార్లమెంట్‌‌‌‌లో పోరాటం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌‌‌‌ నాయకులు ఎన్నడూ రైతులకు నీళ్లు ఇవ్వలేదని, వారికి సాగునీరు ఇస్తే తమ భూముల్లో పనికి రారన్న భూస్వామ్య మనస్తత్వమే ఉందని కట్టా శేఖర్‌‌‌‌రెడ్డి అన్నారు. సాగు నీళ్ల కోసం కాంగ్రెస్‌‌‌‌ నేతలెవరూ పోరాటం చేయలేదని, అలాంటి వారి పేర్లు ఎస్సారెస్పీ రెండో దశకు పెట్టడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని కాపాడుకునేందుకు స్మృతి కేంద్రం, మెమోరియల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ రెండో దశకు దామోదర్‌‌‌‌ రెడ్డి పేరు పెట్టాలని ఎవరు సూచించారని ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలకు గోదావరి నీళ్లు తెచ్చేందుకు బీఎన్‌‌‌‌ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. బీఎన్​రెడ్డిని విస్మరించడం అంటే తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రభుత్వ పెద్దలకు తెలియదనే అనుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ కెనాల్‌‌‌‌కు బీఎన్‌‌‌‌.రెడ్డి పెట్టాలని డిమాండ్​ చేశారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. రెండేండ్ల కాంగ్రెస్‌‌‌‌ పాలనలో తెలంగాణ చరిత్ర, సంస్కృతితో పాటు ధిక్కార స్వభావం కూడా పోయిందన్నారు. కార్యక్రమంలో గోరటి వెంకన్న,  జూలూరి గౌరీ శంకర్‌‌‌‌ పాల్గొన్నారు.