బాబుకు 2 వేలు..పాపకు 1500 ...కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో సిబ్బంది దందా...

బాబుకు 2 వేలు..పాపకు 1500 ...కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో సిబ్బంది దందా...

పేరుకే ప్రభుత్వాసుపత్రి.. కానీ ఇక్కడ లంచం ఇవ్వనిదే పని జరగదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోటి మెటర్నిటీ హాస్పటల్ లో  సిబ్బంది రోగుల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. రోగుల ఆత్రుతను క్యాష్ చేసుకుంటూ.. అడగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

 

పాపకో రేటు.. బాబుకో రేటు

గవర్నమెంట్ ఆసుపత్రి అంటేనే పేదల ఆసుపత్రి అంటారు. ప్రైవేటు ఆసుపత్రిలో వేలకు వేలు ఖర్చు పెట్టే స్థోమత లేక పేదలు డెలివరీ కోసం కోటి  ప్రభుత్వాసుపత్రికి వస్తుంటే వారి దగ్గరే వసూళ్లకు పాల్పడుతున్నారు సిబ్బంది. ఇక్కడ గర్బిణీ ప్రసవం అయితే చాలు..సిబ్బంది పండగ చేసుకుంటారు. అంతేకాదు పాపకు ఓ రేటు..బాబుకు ఓ రేటు ఫిక్స్ చేశారు. అబ్బాయి పుడితే రూ. 2 వేలు, అమ్మాయి పుడితే  1500 వసూళు చేస్తున్నారు. 

గేటు నుంచి వాష్ రూం వరకు..

బిడ్డ పుట్టగానే చూడాలనే తొందర ఎవరికైనా ఉంటుంది. అదే అదునుగా తీసుకొని సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మనీ ఇస్తేనే బిడ్డను చూపిస్తామంటూ వేలకు వేలు లంచం అడుగుతున్నారని బాధితులు వాపోతున్నారు. డబ్బులు లేవు అంటున్నా వినడం లేదంటున్నారు. కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో అడుగడుగునా పైసలు ముట్టజేపనిదే పని అవ్వడం లేదంటున్నారు. ఆసుపత్రికి వస్తే చాలు మొత్తం పదివేల వరకూ పైసలు ఖతమవుతున్నాయంటున్నారు. హాస్పిటల్ గేటు ఎంట్రన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వాష్ రూంల వరకూ డబ్బులు చెల్లిస్తున్నామని బాధితులు తెలిపారు. ఒకవేల పైసలు లేవని బాధితులు చెబితే ఎందుకు వచ్చారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ ట్రీట్ మెంట్ అయినా పూర్తిగా ఇస్తున్నారా అంటే అదీ లేదు.. కొన్ని మెడిసిన్స్ బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. 

పట్టించుకోని సిబ్బంది

పురిటి నొప్పులతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లో ఇంటి నుంచి హాస్పిటల్ కు వచ్చినా.. సిబ్బందికి చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదని బాధితులు విమర్శిస్తున్నారు. గర్భిణీ పరిస్థితి బాగాలేదు ఎమర్జెన్సీ కింద అడ్మిట్ చేసుకోండని అడిగినా... డీఎంఈ పట్టించుకోవడం లేదంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కోటి మెటర్నిటీ హాస్పిటల్ పై  విమర్శలు వస్తున్నా.. ఆసుపత్రి ఉన్నతాధికారుల్లో  మాత్రం ఏ మార్పు కనబడటం లేదంటున్నారు రోగులు. కనీసం ఇక నుంచి అయినా రోగుల పరిస్థితులను అర్థం చేసుకొని సిబ్బంది వ్యవహరించాలని కోరుతున్నారు. ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని.. హైకోర్టులో పలు కేసులు కూడా ఉండటం గమనార్హం. 

అడుగడుగునా సమస్కలు

ఒక్క లంచమే కాదు.. కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో  అడుగడుగునా సమస్కలే.  హాస్పిటల్ లో ఎక్కడ చూసినా చెత్తా చెదారమే దర్శనిస్తోంది. హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గరే బయోవేస్టేజ్ ని పడేస్తున్నారు. దీంతో బయోవేస్టేజ్ నుంచి రక్తం పారుతుంది. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు శుభ్రపరచకపోవడంతో అక్కడికి వచ్చిన వారు నానా అవస్థలు పడుతున్నారు. పరిసర ప్రాంతాలను క్లీన్ చేయకపోవడంతో.. మార్చురీలో నుంచి వచ్చే దుర్వాసనతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో గర్భిణీలు, పిల్లలకు ఊపిరాడటం లేదు. వెయిటింగ్ ఏరియా, హాస్పిటల్ లోపల చెత్తా చెదారం పేరుకుపోయింది. వాష్ రూంలు అయితే మరింత దారుణంగా ఉన్నాయి.