హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్స్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్ట్ 2న రాత పరీక్ష నిర్వహిస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం ప్రకటించింది. 5,204 పోస్టులకు నిరుడు డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇవ్వగా 40,926 మంది నర్సులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఆఫ్‌లైన్ విధానంలో ఎగ్జామ్ ఉండగా, ఈసారి ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తున్నారు. ఒకేసారి అందరికీ పరీక్ష నిర్వహించడం సాధ్యం కానందున, మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్ట్ 2న ఉదయం 9 గంటలకు ఫస్ట్ షిప్ట్, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు రెండో షిఫ్ట్, 4 గంటలకు మూడో షిఫ్ట్ ఎగ్జామ్ పెడతామని అధికారులు వివరించారు. 80 నిమిషాల పాటు పరీక్ష ఉంటుందని, 80 మల్టిపుల్ చాయిస్ క్వశన్స్ ఉంటాయని, ప్రతి క్వశన్‌కు ఒక మార్కు ఉంటుందని తెలిపారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుందని వెల్లడించారు. జులై 23 నుంచి బోర్డు వెబ్‌సైట్లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
