- కాంట్రాక్టు పోస్టులతో రోస్టర్ చిక్కులు.. న్యాయ వివాదాల భయం
- 440 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దాకా భర్తీకి ప్రతిపాదనలు
- మళ్లీ తెరపైకి కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై పీటముడి వీడడం లేదు. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం ఏడాది క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, అడుగు ముందుకు పడడం లేదు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును పక్కనపెట్టి, వర్సిటీల వారీగా భర్తీ చేసుకోవచ్చని సర్కారు కొత్త గైడ్ లైన్స్ ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక సమస్యలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కాంట్రాక్టు పోస్టులను డిస్టర్బ్ చేయొద్దన్న ఓరల్ ఆదేశాలతో రోస్టర్ పాయింట్ల ఖరారుపై అయోమయం నెలకొంది. రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో 2,878 సాంక్షన్ పోస్టులకు 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,572కుగాను 1,114 ఖాళీగా ఉన్నాయి. సరిగ్గా ఏడాది క్రితం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సర్కారు గైడ్ లైన్స్ జారీ చేసింది.
దీని ప్రకారం యూనివర్సిటీల ప్రకారమే నింపుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న పోస్టులను మినహాయించి, మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి అనుగుణంగా ఉస్మానియా వర్సిటీ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల్లో మాత్రమే పోస్టులున్నట్టు అధికారులు గుర్తించి, వాటి భర్తీకి ఈసీ అనుమతితో సర్కారుకు ప్రపోజల్స్ పంపించారు. మొత్తంగా సుమారు 440 వరకూ ప్రతిపాదనలు పంపించగా.. దాంట్లో ఓయూలోనే ఏకంగా 252 పోస్టులు ఉన్నాయి. అయితే, ఈ పోస్టులు ఫైనాన్స్ అప్రూవల్ కోసం సెక్రటేరియెట్ లో ఫైల్ ఆగినట్టు అధికారులు చెప్తున్నారు.
రోస్టర్ ఇబ్బందులు!
ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల (అసిస్టెంట్ ప్రొఫెసర్) కు ఇబ్బంది కలగకుండా నియామకాలు చేపట్టాలన్న ఆదేశాలతో రిజర్వేషన్ల రోస్టర్ అమలు ఇబ్బందులు వస్తున్నాయని పలువురు వీసీలు చెప్తున్నారు. ప్రస్తుతం డిపార్ట్ మెంట్ యూనిట్‌గా రోస్టర్ పాయింట్లను రెడీ చేస్తున్నారు. అయితే, ఇప్పుడున్న కాంట్రాక్టు ఫ్యాకల్టీని ఎలా తీసుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. ప్రస్తుతమున్న వారికి రోస్టర్‌గా తీసుకుంటే.. కొత్తగా తీసుకునే వారికి ఇబ్బందులు వస్తాయని వర్సిటీ అధికారులు చెప్తున్నారు.
మళ్లీ రిక్రూట్ మెంట్ బోర్డు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సిటీ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటు చేసిన యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బోర్డు అంశం తాజగా మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లోనే దీనిపై నాటి గవర్నర్.. క్లారిటీ కోసం రాష్ట్రపతికి పంపించగా అక్కడే పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బోర్డు అంశాన్నీ హోల్డ్ లో పెట్టి, వర్సిటీల వారీగా రిక్రూట్ మెంట్ చేసుకునేలా కొత్త జీఓ రిలీజ్ చేసింది. అయితే, ఇటీవలే రిక్రూట్ మెంట్ బోర్డు అంశంపై యూజీసీ నుంచి రాష్ట్ర అధికారులకు పిలుపు వచ్చింది.
దీంతో టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యా శాఖ కార్యదర్శి శ్రీదేవసేన తదితరులు ఢిల్లీకి వెళ్లి యూజీసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నియామకాల్లో యూజీసీ నిబంధనల ప్రకారమే భర్తీ చేసుకుంటే.. రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని వారికి యూజీసీ స్పష్టం చేసింది. అయితే, సర్కారు పెద్దలతో చర్చించి చెప్తామని రాష్ట్ర అధికారులు తిరిగి వచ్చేశారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని, వర్సిటీల్లో రిక్రూట్ మెంట్ ప్రక్రియను చేపట్టాలని విద్యార్థులు, నిరుద్యోగులు కోరుతున్నారు.
