మా పైసలు మాకివ్వండి.. పదేండ్లుగా పైసా ఇవ్వట్లేదు..

మా పైసలు మాకివ్వండి.. పదేండ్లుగా పైసా ఇవ్వట్లేదు..
  • స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ బకాయిలు రూ.3,175 కోట్లు
  • పదేండ్లుగా పైసా ఇవ్వట్లేదు.. పట్టించుకోవట్లేదు 
  • సర్కార్ చొరవ తీసుకుని  ఇప్పించాలని రిక్వెస్ట్ 
  • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు బల్దియా లేఖ
     

హైదరాబాద్, వెలుగు: బల్దియా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఏ పని చేయాలన్నా కూడా ఆచితూచి.. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ నిర్వాకంతో బల్దియా పీకల్లోతు నష్టాల్లోకి పోయింది. దీంతో ఖజానా ఖాళీగా ఉంది. ఏయే డిపార్ట్ మెంట్ నుంచి ఫీజులుగా రావాల్సిన పైసలు పెండింగ్ ఉన్నాయో తెలుసుకుని వసూలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీకి స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ నుంచి రూ.3,139 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. 

స్టాంప్ డ్యూటీ కింద రూ.3 వేల కోట్లు, మ్యుటేషన్ ఫీజులను రూ.139 కోట్లు ఇవ్వాల్సి ఉంది. స్టాంప్ డ్యూటీ పైసలు పదేండ్లుగా ఇవ్వడంలేదు. రిజిస్ర్టేషన్ అయిన వెంటనే అమ్మకం, కొనుగోలుదారుల నుంచి కలెక్ట్ చేస్తుండగా.. ఆ పైసలను మాత్రం బల్దియాకు ఇవ్వడంలేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖను ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్న కూడా పట్టించుకోవడంలేదు. నిధులను విడుదల చేయడంలేదు.

 పదేండ్ల బీఆర్ఎస్​హయాంలో బల్దియాను అసలు పట్టించుకోలేదు. నిధులివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో మరోసారి మాకు రావాల్సిన పైసలు మాకివ్వండని జీహెచ్ఎంసీ స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖకు లేఖ రాసింది.  అయితే మ్యుటేషన్ ఫీజు విషయానికొస్తే మొత్తం రూ.175 కోట్ల బకాయిలు ఉండేది. వీటిని ఇచ్చేందుకు 3 నెలల కిందట ఆమోదం తెలిపింది.

 ఇందులో రూ.39 కోట్లు ఇచ్చింది. మిగతావి కూడా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. కానీ స్టాంప్ డ్యూటీ పై మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు.  రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బకాయిలను  విడుదల చేయిస్తే తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన బల్దియాకు ఎంతో ఊరట లభిస్తుంది. 

ప్రతిఏటా రూ.300 కోట్లు 

బల్దియాకు స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ ప్రతి ఏటా దాదాపు రూ.300 కోట్ల బకాయి పడుతుంది. గ్రేటర్ సిటీలోకి వచ్చే హైదరాబాద్, సిటీ సౌత్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ర్టార్ ఆఫీసుల్లో జరిగే రిజిస్ర్టేషన్ల నుంచి బల్దియాకు స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ కింద పైసలు రావాల్సి ఉంది.  స్టాంప్ డ్యూటీకి సంబంధించి 1.5 శాతం ఉండగా, మ్యుటేషన్ అయితే 0.1 శాతం  వసూలు చేస్తుంది.

 కానీ ఆ నిధులను బల్దియాకు అందించడంలో నిర్లక్ష్యంగా ఉంటుంది.  మ్యుటేషన్ ఫీజులకు గతంలో రిజిస్ర్టేషన్ అయిన వెంటనే బల్దియా ఖాతాలో జమ అయ్యేది.  రెండేళ్లుగా ఆ విధానం కాకుండా నేరుగా స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ కు వెళ్లిన తర్వాత బల్దియాకు అందించేలా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని కారణంగా కూడా  మ్యుటేషన్ బకాయిలు  పేరుకుపోయాయి. 

అప్పుల్లో కూరుకుపోగా..

 ఇప్పటికే వివిధ పనుల కోసం ఎస్ బీఐ వద్ద రూ.6,880 కోట్ల బల్దియా అప్పు చేసింది. స్ట్రాటజిక్​రోడ్​డెవలప్ మెంట్​ ప్రొగ్రాం(ఎస్ఆర్డీపీ) కింద మరో రూ.4,250 కోట్లు అప్పుగా తెచ్చింది. ఇందులో బాండ్ల ద్వారా 495 కోట్లు సేకరించగా, ఇందులో రూ.200 కోట్లు (8.90 శాతం), 195 కోట్లు (9.38శాతం), రూ.100 కోట్లు (10.23 శాతం) చొప్పున వడ్డీగా తీసుకుంది.  మరో రూ.2,500 కోట్లు(8.65 శాతం),  ఇంకోసారి రూ.505 కోట్ల(7.75 శాతం)ను వడ్డీకి రూపీ టర్మ్ లోన్ గా తెచ్చింది.

 వీటితో పాటు ఇటీవల మరో రూ.750 కోట్లను సేకరించింది. కాంప్రెన్సివ్​ రోడ్​మెయింటెనెన్స్​ ప్రొగ్రాం(సీఆర్​ఎంపీ) కింద రూ.1,460 కోట్లను (7.20 శాతం),  ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లని (7.20 శాతం) వడ్డీతో తీసుకొచ్చింది. అదేవిధంగా జేఎన్​ఎన్​యూఆర్ఎం ఇండ్ల కోసం రూ.140 కోట్ల హడ్కో లోన్ సేకరించింది. ఇందులో రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీతో తీసుకోగా, రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీతో తీసుకుంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం ట్రేడ్స్ ద్వారా రూ.350 కోట్ల అప్పు చేసింది. ప్రస్తుతం రావాల్సిన రూ.3,169 కోట్లు వస్తే బల్దియా అప్పుల్లో సగం తీరుతాయి.