సింధు, సేన్‌పై ఫోకస్‌

సింధు, సేన్‌పై ఫోకస్‌

జకార్తా :  ప్రతిష్టాత్మక థామస్‌‌ కప్‌‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన ఇండియా మెన్స్‌‌ బ్యాడ్మింటన్‌‌  టీమ్​ మెంబర్​ లక్ష్యసేన్‌‌తో పాటు స్టార్‌‌ షట్లర్​ పీవీ సింధు, మరో సవాల్‌‌కు రెడీ అయింది. మంగళవారం మొదలయ్యే ఇండోనేసియా సూపర్‌‌ సిరీస్‌‌ 500 టోర్నమెంట్‌‌లో  టైటిల్‌‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటి వచ్చే నెల 28 నుంచి బర్మింగ్‌‌హామ్‌‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని ఇండియా షట్లర్లంతా ఆశిస్తున్నారు. థామస్‌‌ కప్‌‌లో ఇండియాను విజేతగా నిలిపిన కిడాంబి శ్రీకాంత్‌‌, హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. దాంతో,  మెన్స్​ సింగిల్స్​లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌‌ లక్ష్యపైనే అందరి ఫోకస్‌‌ ఉంది. ఏడో సీడ్‌‌గా బరిలోకి దిగుతున్న సేన్‌‌.. తొలి రౌండ్‌‌లో డెన్మార్క్‌‌కు చెందిన క్రిస్టియన్‌‌ విట్టింగస్‌‌తో పోటీ పడనున్నాడు. విట్టింగస్‌‌తో ఇది వరకు ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లోనూ లక్ష్య ఓడిపోయాడు. దాంతో, ఈ సారి అతడిన దాటి ముందుకెళ్లాలనని సేన్‌‌ ఆశిస్తున్నాడు. ఫామ్‌‌లో లేని  సమీర్‌‌ వర్మ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తొలి రౌండ్‌‌లో తను క్వాలిఫయర్‌‌తో పోటీ పడనున్నాడు. శుభాంకర్‌‌ డే, కార్తికేయ గుల్షన్‌‌ క్వాలిఫయర్స్‌‌లో బరిలో నిలిచారు. ఇక, విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో సింధు ఇండియా చాలెంజ్‌‌ను ముందుకు నడించనుంది. ఆమెకు సులభ డ్రా ఎదురైంది. థాయ్‌‌లాండ్‌‌ ఓపెన్‌‌లో సెమీఫైనల్లో ఓడి నిరాశ పరిచిన సింధు తొలి రౌండ్‌‌లో డెన్మార్క్‌‌కు చెందిన లైన్‌‌ క్రిస్టోఫర్సెన్‌‌తో పోటీ పడుతుంది. ఆకర్షి కశ్యప్‌‌ క్వాలిఫయర్‌‌గా పోటీలో ఉంది. మెన్స్‌‌ డబుల్స్‌‌లో సుమీత్‌‌ రెడ్డి, మను అత్రి జంట తొలి రౌండ్‌‌లో లోకల్‌‌ జోడీ ప్రముద్య–యెరెమియతో పోటీ పడుతుంది. విమెన్స్‌‌ డబుల్స్‌‌లో ఇండియా నుంచి రెండు జోడీలు పోటీలో ఉన్నాయి. 22వ సీడ్‌‌ సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ.. బ్రెజిల్‌‌కు చెందిన జాక్వెలిన్‌‌ లిమా–సమియాతో పోరు ఆరంభించనుంది. ఇందులో గెలిస్తే రెండో రౌండ్‌‌లోనే టాప్‌‌ సీడ్‌‌ చైనా జంట చెన్‌‌ క్వింగ్‌‌–జియా యి ఫన్‌‌తో సిక్కి–అశ్వినికి అతి పెద్ద సవాల్‌‌ ఎదురవనుంది. సిమ్రన్‌‌ సింఘి–రితిక తొలి రౌండ్‌‌లో టాప్‌‌ సీడ్‌‌ లీ సొ హీ–షిన్‌‌ సెయుంగ్‌‌ (సౌత్‌‌ కొరియా) జంటతో పోటీ పడుతుంది. 

సైనా, కశ్యప్, ప్రణయ్​ విత్‌‌డ్రా
నేషనల్‌‌ ట్రయల్స్‌‌కు హాజరుకాకుండా ఉబెర్‌‌ కప్‌‌లో పోటీ పడలేకపోయిన సైనా నెహ్వాల్‌‌ ఆమె భర్త పారుపల్లి కశ్యప్‌‌తో  పాటు  థామస్‌‌ కప్‌‌ విన్నింగ్‌‌ హీరో హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ ఇండోనేసియా సూపర్‌‌ సిరీస్‌‌ టోర్నీ నుంచి చివరి నిమిషంలో  విత్‌‌డ్రా అయ్యారు. వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో భాగంగా టోర్నీకి దూరంగా ఉండాలని సైనా నిర్ణయించుకోగా.. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న  కశ్యప్‌‌ ఇంకా పూర్తి ఫిట్‌‌నెస్‌‌ సాధించలేదు. ఈ టోర్నీ తర్వాత జరిగే నాలుగు ఈవెంట్లలో పోటీపడేందుకే వైదొలిగినట్టు ప్రణయ్‌‌ చెప్పాడు.