జనసేనకు 10 నుంచి 12 సీట్లు .. ఆ పార్టీతో పొత్తుపై బీజేపీ కీలక నేతల చర్చ

జనసేనకు 10 నుంచి 12 సీట్లు .. ఆ పార్టీతో పొత్తుపై బీజేపీ కీలక నేతల చర్చ

హైదరాబాద్, వెలుగు: జనసేనతో పొత్తు ఖరారు కావడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయి సీట్ల కేటాయింపుపై చర్చించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ మీటింగ్ లో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహా ఇన్ చార్జ్ అరవింద్ మీనన్, ఎంపీ లక్ష్మణ్​, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 

జనసేనకు 10 నుంచి 12 సీట్ల వరకు ఇవ్వాలని మీటింగ్ లో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఏయే నియోజకవర్గాలు కేటాయించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి, కూకట్ పల్లి సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. మిగతా సీట్లు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇవ్వాలని కోరుతోంది. 

అయితే జిల్లాల్లోని సీట్లపై అభ్యంతరాలు లేనప్పటికీ.. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి సీట్లను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండడం, ఈ టికెట్ల కోసం సొంత పార్టీ నేతల్లోనే పోటీ బాగా ఉండడంతో... వాటిని జనసేనకు కేటాయిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. 

వలస వచ్చేటోళ్లకు సీట్లు..  

ఇప్పటికే రెండు విడతల్లో 53 మందిని ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు మూడో జాబితాపై కసరత్తు చేస్తోంది. మూడో లిస్టులో 35 నుంచి 45 మంది అభ్యర్థులను ప్రకటించాలని మీటింగ్ లో నిర్ణయించినట్టు తెలిసింది. ఎలాంటి సమస్యల్లేని సీట్లను ఇందులో ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ మూడో జాబితాలో 45 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే, మొత్తం 98 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్టవుతుంది. అంటే ఇంకో 21 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. 

ఇందులో జనసేనకు 12వరకు ఇచ్చినా, మరో 9  సీట్లు ఉంటాయి. అప్పటి వరకు పరిస్థితిని బట్టి కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలకు ఈ సీట్లను ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని మీటింగ్​లో చర్చ జరిగినట్టు తెలిసింది. కాంగ్రెస్ టికెట్ దక్కని చాలామంది నేతలు బీజేపీ వైపు చూస్తుండడంతో, అలాంటోళ్లలో కొందరికి టికెట్ ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. 

6 లేదా 7న చివరి జాబితా.. 

జనసేనకు సీట్ల కేటాయింపు, మూడో విడత జాబితాపై హైకమాండ్​తో చర్చించేందుకు రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ప్రకాశ్ జవదేకర్, కిషన్ రెడ్డి, ఈటల, లక్ష్మణ్, సంజయ్ ఆదివారం రాత్రి లేదా సోమవారం ఢిల్లీకి వెళ్లే ఏర్పాట్లలో ఉన్నట్టు తెలిసింది. నవంబర్ 1న ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. 

అందులో మూడో జాబితా ఫైనల్ కానుంది. హైకమాండ్ ఆమోదం తర్వాత మూడో లిస్టు రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 3 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండడంతో మిగిలిపోయిన సీట్లతో చివరి జాబితాను 6, 7 తేదీల్లో ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.