ఫిబ్రవరి 23 న రాష్ట్ర కేబినెట్ భేటీ

ఫిబ్రవరి 23 న రాష్ట్ర కేబినెట్ భేటీ
  •     బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ
  •     రైతు భరోసా పంపిణీ, మూడు కొత్త కార్పొరేషన్లలో ఉద్యోగులపై నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది. సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.00 గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశమున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా అయిన నేపథ్యంలో పరిపాలనా సంబంధమైన అంశాలు, ఆ కార్పొరేషన్లలో కొత్త ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగుల సర్దుబాటుపై చర్చించే అవకాశమున్నది. 

దీనికి తోడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉన్నందున వీటిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నది.అయితే ఇంటర్, టెన్త్ విద్యార్థుల పరీక్షలు, పలు కోర్సులకు ఎంట్రన్స్ టెస్టులు ఉండటంతో ఇప్పట్లో నిర్వహించకూడదని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026–27 బడ్జెట్ రూపకల్పన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 

వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బుధవారం నుంచి శాఖల వారీ సమీక్షలు జరగాల్సి ఉన్నందున ఏయే శాఖల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయో చర్చించి రానున్న బడ్జెట్‌లోని ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రాథమిక స్థాయిలో నిర్ణయాలు జరిగే అవకాశమున్నది. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా ఏయే తేదీలు అనుకూలంగా ఉంటాయో చర్చించి డ్రాఫ్ట్ షెడ్యూలును ఖరారు చేసే అవకాశమున్నది. దీనికి తోడు మూసీ పునరుజ్జీవన పథకం, రైతుభరోసా స్కీమ్‌కు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు తదితరాలపై కూడా చర్చ జరిగే అవకాశమున్నది. రాష్ట్రంలో కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర సొంత ఆదాయ వనరులపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు.