జూన్ 8న రాష్ట్ర కేబినెట్ భేటీ

జూన్ 8న రాష్ట్ర కేబినెట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ జూన్ 8 మంగళవారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో వైద్యం,కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పలు అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువుల లభ్యత తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్‌లో చర్చించే చాన్సుంది. 

కాగా.. జూన్ 7న రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లా ప్రభుత్వ దవాఖానాలలో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జూన్ 8న కేబినెట్ భేటీ ఉండటంతో.. ఆ కార్యక్రమాన్ని జూన్ 9కి వాయిదా వేశారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులందరూ ఒకేసారి డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.