సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్​ తీర్మానం

సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్​ తీర్మానం

అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలని నిర్ణయం
24 నుంచి పట్టణ ప్రగతి.. రేపు మున్సిపల్​ సదస్సు
వేలానికి రాజీవ్​ స్వగృహ ఇండ్లు
అభయ హస్తం సమీక్ష బాధ్యతలు మంత్రి హరీశ్​కు
సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్​ తీర్మానం
రాష్ట్ర కేబినెట్​ తీర్మానం 
24 నుంచి పట్టణ ప్రగతి.. విధివిధానాల కోసం రేపు కలెక్టర్ల సదస్సు

హైదరాబాద్​, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కేబినెట్​ తీర్మానం చేసింది. రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ఇది ప్రమాదంలో పడేసేలా ఉందని అభిప్రాయపడింది. సీఏఏను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలం ద్వారా అమ్మేయాలని, ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం చేపట్టాలని కూడా కేబినెట్​ నిర్ణయించింది. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్​అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. సుమారు 5గంటల పాటు జరిగిన ఈ భేటీలో సీఏఏ, పట్టణ ప్రగతి, రాష్ట్రంలోని వివిధ పథకాల తీరుతెన్నులపై చర్చించారు. సిటిజన్​షిప్​ ఇచ్చే విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని కేంద్రాన్ని రాష్ట్ర కేబినెట్​ కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని, సీఏఏను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.  కేరళ, పంజాబ్, రాజస్థాన్,  బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే రాష్ట్ర అసెంబ్లీలో కూడా సీఏఏ రద్దుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

వేలానికి రాజీవ్​ స్వగృహ ఇండ్లు

రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేని రుణం తదితర పథకాల పరిస్థితిపై పూర్తిగా స్టడీ చేపట్టాలని కేబినెట్​ నిర్ణయించింది. రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలం ద్వారా అమ్మేయాలని, దీనిపై విధివిధానాల కోసం చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన అధికారుల కమిటీని వేసింది. ఇందులో సభ్యులుగా రామకృష్ణారావు, అరవిందకుమార్ ఉండనున్నారు. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాకు కేబినెట్​ అప్పగించింది.

బడ్జెట్ ​సమావేశాల్లో లోకాయుక్త బిల్లు

తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.

10 రోజులు పట్టణ ప్రగతి

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం చేపట్టాలని కేబినెట్​ నిర్ణయించింది. దీనిపై విధి విధానాలు ఖరారు చేసేందుకు ఈ నెల 18న  ఉదయం11 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు చేపట్టనుంది. సదస్సుకు మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఆహ్వానించనున్నారు. సదస్సులో పాల్గొన్న వారందరినీ అదే రోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వెజ్–నాన్ వెజ్ మార్కెట్​ను, శ్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళ్తారు.

సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో పచ్చదనం, పారిశుధ్యం నెలకొనాలన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు. ‘‘పట్టణాలు ఇప్పుడు ఎట్లున్నయ్​? రాబోయే రోజుల్లో ఎట్లుండాలె? అనేది ప్లాన్​ చేసుకోవాలి. అందుకు తగ్గట్టు నిధులు ఉపయోగించుకొని క్రమపద్ధతిలో ముందుకు పోవాలి” అని ఆయన అన్నారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని సీఎం అభినందించారు.  వార్డు యూనిట్ గా పట్టణ ప్రగతి జరగాలని, ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కేబినెట్​ నిర్ణయించింది. పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలని, ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియను వచ్చే ఐదు రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొంది.

కేబినెట్​ మరిన్ని నిర్ణయాలు

-మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3,100 వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగతా 2500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి, వాటినీ సమకూర్చాలి.
-పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.
-పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా షి టాయిలెట్స్ నిర్మించాలి. వీటికోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి.
-వీధులపై వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించేదాకా ఇబ్బంది పెట్టొద్దు.
-వెజ్/ నాన్ వెజ్ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటికోసం స్థలాలను ఎంపిక చేయాలి.