ఆగస్ట్ నెలాఖరు కల్లా గంజాయి ఫ్రీ ధూల్‌‌పేట్‌‌ !

ఆగస్ట్ నెలాఖరు కల్లా గంజాయి ఫ్రీ ధూల్‌‌పేట్‌‌ !
  • 25 రోజులుగా ఇంటింటి సోదాలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ
  • ఎక్సైజ్, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌, డీటీఎఫ్, ఎస్టీఎఫ్‌‌ టీమ్‌‌లను ఏర్పాటు చేసిన అధికారులు 
  • 54 మందిపై కేసులు.. 15 మంది అదుపులో..
  • గంజాయి అమ్మకాల్లో మహిళలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని ధూల్‌‌పేట్‌‌ను ఈ నెలాఖరు నాటికి గంజాయి నిర్మూలన ప్రాంతంగా మారుస్తామని ఎక్సైజ్‌‌ అధికారులు వెల్లడించారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ ధూల్‌‌పేట్ పేరుతో 25 రోజుల నుంచి ఎక్సైజ్, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌, డీటీఎఫ్, ఎస్టీఎఫ్‌‌లతో పాటు పోలీస్ టీంలు కూడా ధూలిపేట్‌‌లో గంజాయి కోసం ఇంటింటి సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారుల సోదాలతో గంజాయి స్మగ్లర్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఎక్సైజ్ దాడులకు భయపడి ఇండ్లకు తాళాలు వేసుకొని, బయటి నుంచే గంజాయి అమ్మకాలు చేపడుతున్నారు. 

హైదరాబాద్‌‌లో ఎక్కువ శాతం గంజాయి సప్లయ్‌‌ ధూల్‌‌పేట నుంచే జరుగుతోందని అధికారులు గుర్తించారు. 15 మందిపైగా బిగ్ షాట్స్ ఈ వ్యాపారంలో రూ.కోట్లు గడించినట్లు ఎక్సైజ్, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ అధికారులు వెల్లడించారు. వీరితో పాటు స్థానికంగా ఉన్న 20 ఇండ్లు, దుకాణాల నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుసుకొని, 54 మందిపై కేసులు నమోదు చేశారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి 100 నుంచి 150 మంది అమ్మకాలు చేపట్టడంతో పాటు డోర్ డెలివరీ చేస్తున్నారని తెలుసుకున్నారు. గంజాయి బిజినెస్‌‌ను మగవారి కంటే మహిళలే ముందుండి నడిపిస్తుండటంతో ఎక్సైజ్ పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గంజాయి సప్లయిర్స్ 15 మందిలో ఆరుగురుని ఎక్సైజ్ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు.

అధికారులకు నోటీసులు పంపిస్తున్నరు.. 
ఎక్సైజ్ శాఖ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గంజాయి అమ్మకందారులు అధికారులకు చెక్‌‌ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాడులు నిర్వహిస్తున్నారని, మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఎక్సైజ్‌‌ శాఖ అధికారులకు లీగల్‌‌ నోటీసులు పంపిస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నాటు సారా తయారీ దారులపై దాడుల సమయంలోనూ ఇదే విధంగా ఎదురు తిరిగే ప్రయత్నాలు చేశారని, అప్పుడు కూడా ఎక్సైజ్ పోలీసులు భయపడలేదని, ఇప్పుడు కూడా ధూల్‌‌పేట్‌‌లో గంజాయిని నిర్మూలించే వరకు దాడులను ఆపే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ధూల్‌‌పేట్‌‌ ఆపరేషన్‌‌లో భాగంగా 25 రోజుల్లో 24 కేసులు నమోదు చేశారు. ఇందులో 54 మందిపై కేసులు నమోదు చేయగా, 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 12 వెహికల్స్‌‌ను సీజ్ చేయడంతో పాటు 26 మందిని బైండోవర్ చేశారు. 

గంజాయిని అరికట్టడమే లక్ష్యం.. 
గంజాయి, డ్రగ్స్, నాటుసారాను నిర్మూలించడమే మా లక్ష్యం. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌‌పై చాలా సీరియస్‌‌గా ఉంది. గంజాయి, డ్రగ్స్ వల్ల యువత తమ భవిష్యత్‌‌ను నష్టపోతున్నారు. ఈ విషయంలో విద్యార్థుల పేరెంట్స్‌‌, కాలేజీ యాజమాన్యాలు ఎక్సైజ్ పోలీసులకు సహకరించాలి. ధూల్‌‌పేట్‌‌లో ఇంటింటికి తిరిగి అందరి వివరాలు సేకరించాం. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేపట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. 
- వీబీ కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్‌‌ ఎన్​ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌‌‌