కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు ఎప్పుడో?

కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు ఎప్పుడో?
  • గత 14 నెలల్లో పెన్షన్ అర్హత పొందినోళ్లు లక్షన్నర మంది
  •  ఎప్పటికప్పుడు పింఛన్లు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు
  • మళ్లీ ఎన్నికలొస్తేనే కొత్త పింఛన్లు మంజూరయ్యే పరిస్థితి

    
హైదరాబాద్, వెలుగు: అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర సర్కార్ కొత్త పింఛన్లను ఎప్పటికప్పుడు మంజూరు చేయడం లేదు. ఆసరా పెన్షన్ల మంజూరు కోసం 2021 అక్టోబర్ లో అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం... ఆ తర్వాత గత 14 నెలల కాలంలో కొత్తగా అర్హత పొందినవారిని పట్టించుకోలేదు. దీంతో 2021 నవంబర్ తర్వాత భర్తను కోల్పోయి వితంతువులుగా మారినోళ్లు, కొత్తగా సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు, 57 ఏళ్లు నిండినోళ్లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 50 ఏళ్లు నిండిన బీడీ, గీత కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్లకు నోచుకోవడం లేదు. మళ్లీ ఎన్నికలు వస్తే తప్పా ప్రభుత్వం వీరి గురించి ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో లక్షన్నర మంది అర్హులు.. 

రాష్ట్రవ్యాప్తంగా భర్తను కోల్పోయిన మహిళలు,  కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందిన దివ్యాంగుల నుంచి పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలు అప్లికేషన్లను తీసుకుని, అర్హులను గుర్తించి ఎప్పటికప్పుడు ఆన్​ లైన్​ చేస్తున్నారు. రాష్ట్రంలో నెలనెలా సుమారు ఐదారు వేల మందికి 57 ఏళ్లు నిండుతున్నట్లు అంచనా. మొత్తంగా సగటున ప్రతి నెలా ఆసరా పింఛన్ కు అర్హత పొందుతున్నవారి సంఖ్య 10 వేలకుపైనే ఉంటుందని అంచనా. ఈ లెక్కన గత 15 నెలల కాలంలో సుమారు లక్షన్నర మంది అర్హత పొందినట్లు సమాచారం.  వీరంతా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. 

 ఎన్నికలు వస్తేనే పింఛన్లు.. 

సీఎం కేసీఆర్ తన మొదటి ప్రభుత్వాన్ని 2018 సెప్టెంబర్ లో రద్దు చేశాక.. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నాలుగేళ్లు నిలిచిపోయింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా 57 ఏళ్లు నిండినవాళ్లకు కూడా పింఛన్ మంజూరు చేస్తామని కేసీఆర్​హామీ ఇచ్చారు. కానీ మూడేళ్లు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదు. అనంతరం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు 2021 ఆగస్టు, అక్టోబర్ నెలల్లో 57 ఏళ్లు నిండినోళ్ల నుంచి రెండు దఫాలుగా అప్లికేషన్లు స్వీకరించారు. అప్పటికే 57 ఏళ్ల రూల్ తో సంబంధం లేని వితంతువులు, ప్రమాదాల్లో కాళ్లూచేతులు పోగొట్టుకున్నోళ్లు, బోదకాలు, ఎయిడ్స్  బాధితులు, 50 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, పాత రూల్ ప్రకారం 65 ఏండ్లు నిండిన వృద్ధులు మొత్తం దాదాపు 3 లక్షల మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2021లో అప్లికేషన్లు పెట్టుకున్నవాళ్లకు మునుగోడు ఉప ఎన్నికలకు ముందు 2022 సెప్టెంబర్ లో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. సర్కార్ తీరును బట్టి మళ్లీ ఎన్నికలు వస్తే తప్పా కొత్త పింఛన్లు మంజూరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

భర్త చనిపోయి రెండేళ్లయినా పెన్షన్ వస్తలేదు

నాభర్త  దుర్గం చరణ్ దాస్ చనిపోయి రెండేండ్లయింది. నేను కూలి పని చేస్తేనే బతుకు.  విడో పెన్షన్ కోసం అప్లై చేసుకున్న. ఆఫీసర్లను అడిగితే రేపు మాపు అంటున్నరు.  నాకు పెన్షన్ వచ్చేలా చూడాలి. 
- దుర్గం నిర్మల, బీబ్రా, దహెగాం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా

58 ఏళ్ల వయసున్నా పింఛన్​ ఇస్తలేరు

మాది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీ రాంపూర్ మండలం ఎదులా పూర్. 57 ఏళ్లకే  పింఛన్ ఇస్తమని  ప్రభుత్వం చెప్పింది. నా వయసు 58 సంవత్సరాలు. లెక్క ప్రకారం నాకు పింఛన్ రావాలె. అప్లై చేసుకున్న. అధికారులను అడిగితే ఎప్పుడు వస్తదో తెల్వదని చెప్తున్నరు. - జక్కుల కొమురయ్య, ఎదులాపూర్