
సికింద్రాబాద్/న్యూఢిల్లీ, వెలుగు : హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్)కు ఈ నెల 15న రాష్ట్ర గవర్నర్ తమిళిసై రానున్నారు. జాతీయ పోషకాహార సంస్థ, విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వాతంత్ర్య సమరంలో విజ్ఞాన శాస్త్రం’అనే పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ హేమలత వెల్లడించారు.
తమిళ న్యూఇయర్ వేడుకల్లో గవర్నర్
ఒక రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన తమిళ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మత్స్యకార, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రి ఎల్.మురుగన్ ఏప్రిల్ 14న తమిళుల నూతన సంవత్సరం ‘పుతండు’వేడుకల్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కామరాజ్ మార్గ్‌లోని మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మోడీకి విగ్రహాన్ని బహూకరించారు. ఈ వేడుకల్లో పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, బీజేపీ లీడర్లు, తమిళ ప్రజలు పాల్గొన్నారు. తర్వాత గవర్నర్ రాత్రి హైదరాబాద్ తిరిగి బయలుదేరి వెళ్లారు.