సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ.. లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో హోం, జైళ్ళు, అగ్నిమాపకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం కల్పిస్తూ..ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ పలు భవనాల సెల్లార్లను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు బిల్డింగ్ ను రెంట్ కు తీసుకుని కమర్షల్ పర్పస్ లో ఉపయోగిస్తున్నట్లు సమీక్షలో తేల్చారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని బిల్డింగ్ యజమానులు, వాటిని ఉపయోగించే వారిపై నిఘా పెట్టాలని హోంశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
అగ్నిప్రమాదాలు జరగకుండా చూసి మనుషుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఇందుకోసం తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ విషయంలో అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ సమన్వయంతో కలసి పని చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ జైన్, ఫైర్ డిపార్టుమెంట్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య పాల్గొన్నారు.
