మక్తల్ లో స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు.. ఫిబ్రవరి 20 నుంచి సీఎం కప్ టోర్నీ..33 జిల్లాల నుంచి 66 జట్లు

మక్తల్ లో స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు.. ఫిబ్రవరి 20 నుంచి సీఎం కప్ టోర్నీ..33 జిల్లాల నుంచి 66 జట్లు

మహబూబ్‌‌నగర్/మక్తల్, వెలుగు: జిల్లాగా ఏర్పడిన ఏడేళ్ల తర్వాత నారాయణపేట మొదటిసారిగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌‌లో భాగంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మక్తల్ మున్సిపాలిటీలోని మినీ స్టేడియంలో శుక్రవారం నుంచి సోమవారం వరకు జరుగనున్నాయి.

పోటీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 66(గర్ల్స్​, బాయ్స్) జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. వెయ్యి మందికిపైగా క్రీడాకారులు, వంద మంది కోచ్​లు ఇప్పటికే మక్తల్‌‌కు చేరుకున్నారు. కోచ్​ల కోసం మక్తల్, నారాయణపేటలోని ప్రైవేట్ లాడ్జీలు బుక్ చేశారు. క్రీడాకారుల కోసం మినీ స్టేడియం సమీపంలోని 15 హాస్టళ్లను కేటాయించారు.

అందులో బాలికలకు ఎనిమిది, బాలురకు ఏడు హాస్టళ్లు ఉన్నాయి. బాలికలు ఉండే హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తులో ఉంచారు. శానిటేషన్, తాగునీటి సదుపాయాలు కల్పించారు. రవాణా కోసం ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు, ట్రావెల్స్ వాహనాలు అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల పాటు ప్లేయర్ల కోసం ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. 

డే అండ్ నైట్ మ్యాచ్‌‌లు..

మినీ స్టేడియంలో 650 ఫోకస్ లైట్లు ఏర్పాటు చేశారు. పోటీలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. ఆరు కోర్టులు సిద్ధం చేశారు. ప్రతి జట్టు ఆరు మ్యాచ్‌‌లు ఆడుతుంది. విన్నింగ్​ను బట్టి క్వార్టర్ ఫైనల్స్, సెమీస్, ఫైనల్‌‌కు చేరుకుంటాయి. ప్లేయర్లకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు డీవైఎస్‌‌వో శెట్టి వెంకటేశ్ తెలిపారు.