ఉపాధి హామీలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌

ఉపాధి హామీలో తెలంగాణ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌

హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అందుకే రకరకాల తనిఖీల పేరుతో వేధించే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై మండిపడ్డారు. బోయినపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్వర్యంలో జరిగిన  ఫీల్డ్ అసిస్టెంట్ల కృత‌జ్ఞత స‌భలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందన్నారు. అది చూసి ఓర్వలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ఇప్పటికే ప‌శ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఇలాగే క‌క్ష గట్టి ఆరు నెల‌ల నుంచి ఉపాధి హామీ ప‌థ‌కాన్ని అక్కడ  నిలిపివేశారని తెలిపారు. బీజేపీ అధికారంలో లేని ఛత్తీస్ గ‌డ్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్ లోనూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. 2014 నుంచి 2018 వ‌ర‌కు కేవ‌లం 3 టీంల ను పంపించారన్న మంత్రి... ఈ ఏడాదిలో ఇప్పటికే మొత్తం 18 టీంల‌ను పంపించి లేని త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూపేద‌ల నోట్లో మ‌ట్టి కొట్టాల‌ని చూస్తున్నారని మండిపడ్డారు.

చెరువుల్లో పూడిక తీత, హరిత హారం మొక్కలకు కంచెల ఏర్పాటు వంటివి ఉపాధి హామీ కింద ఎందుకు చేస్తున్నారని కేంద్రం ప్రశ్నిస్తోందని చెప్పారు. హరిత హారం వల్ల 7.5 శాతం పచ్చదనం పెరిగి... వర్షాలు సకాలంలో పడుతున్నాయని గుర్తు చేశారు. రైతులకు కల్లాలు కడితే ఎందుకు కడుతున్నారని బీజేపీ నాయకులు అంటున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ కింద గడ్డపార, పార, తట్ట వంటి వాటికి కేంద్రం కోత పెట్టిందని విమర్శించారు. కొందరి స్వార్ధానికి గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు బలయ్యారన్న మంత్రి... సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో వాళ్లని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనంత వేతనం రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, మర్రి రాజ శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నేతలు మేక‌ల ర‌వి, కంక‌ల సిద్ధిరాజ్‌, ద‌యామ‌ణి, పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.