- 2025లో రికార్డు స్థాయిలో 205 మంది అవయవ దానం
- ఏకంగా 763 ఆర్గాన్స్ సేకరణ.. వందల మందికి పునర్జన్మ
హైదరాబాద్, వెలుగు: అవయవ దానంలో మనరాష్ట్రం మళ్లీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025 ఏడాదికి గానూ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్ఓటీటీఓ) విడుదల చేసిన లెక్కల్లో ఈ విషయం బయటపడింది. గతేడాది ఏకంగా 205 మంది బ్రెయిన్ డెడ్ పేషెంట్ల కుటుంబాలు తమ వారి అవయవాలను దానం చేసి.. చావు బతుకుల్లో ఉన్న వందల మందికి పునర్జన్మను ప్రసాదించాయి.
కాగా, అవయవదానంలో మొదటి స్థానంలో నిలిచినందుకు గతేడాది రాష్ట్రం నుంచి జీవన్ ధాన్.. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు పొందింది. గత ఆగస్టులో జీవన్ దాన్ అధికారులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నుంచి ఢిల్లీ వేదికగా అవార్డు అందుకున్నారు.
ప్రతి పది లక్షల మందికి ఐదుగురు దాతలు
దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. 2025లో మొత్తం 205 మంది దాతల నుంచి అవయవాలు సేకరించారు. దీంతో ప్రతి పది లక్షల జనాభాకు ఐదుగురు దాతలు అనే అరుదైన మైలురాయిని తెలంగాణ దాటింది. 2013లో కేవలం 41గా ఉన్న దాతల సంఖ్య.. 2024 కు 188 కే చేరింది. 2025 నాటికి ఆ సంఖ్య 205కు చేరడం విశేషం. అంటే.. 2013 నుంచి 2025 వరకు దాతల సంఖ్య 5 రెట్లు పెరిగింది. 12 ఏండ్ల కాలంలో 400 శాతం వృద్ధి కనిపించింది.
దాతల్లో మగవారే అధికం..
అవయవ దానం చేసిన వారిలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తం దాతల్లో 160 మంది మగవారు ఉండగా.. 45 మంది ఆడవారు ఉన్నారు. హాస్పిటల్స్ వారీగా.. 197 డొనేషన్లు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచే రాగా.. ప్రభుత్వ హాస్పిటల్స్ వాటా 8 మాత్రమే ఉన్నాయి.
- డా శ్రీభూషణ్ రాజు, జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్
763 అవయవాల సేకరణ
205 మంది దాతల నుంచి 763 అవయ వాలను సేకరించారు. ఇందులో మేజర్ ఆర్గా న్స్ 604 కాగా, మైనర్ ఆర్గాన్స్, టిష్యూలు 159 ఉన్నాయి. 291 కిడ్నీలు, 186 లివర్లు, 32 గుండెలు, 95 లంగ్స్, 154 కళ్లు, స్కిన్ ముగ్గురి నుంచి, చిన్నపేగు ఇద్దరి నుంచి సేకరించారు.
