
- ఐక్యంగా ఉద్యమించి రిజర్వేషన్లు సాధిద్దాం
- ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు.. ఆవేశపడొద్దని పిలుపు
ముషీరాబాద్/బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో.. మిలియన్ మార్చ్ తరహాలో 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందన్నారు.
ఈ బంద్కు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలతో దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుందని, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన బీసీల కోర్ కమిటీ, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు, కుల, ఉద్యోగ, మహిళా సంఘాల నేతలతో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు స్టేతో బీసీ సమాజం నిరాశకు లోనై, ఆక్రోశంతో ఉందన్నారు. కానీ, ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోకుండా.. సహనంతో ఉండాలని సూచించారు. ఇది ప్రజా ఉద్యమం, ధర్మ ఉద్యమమని.. ఈ ఉద్యమానికి అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు తరలి రావాలని కోరారు.
అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనా చారి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు ఐక్యమై ఒక శక్తిగా అవతరించడం ఎంతో అవసరమన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్ట్ స్టే.. బీసీలకు చీకటి రోజని, ఇది బీసీల నోటికాడి బుక్క ఎత్తగొట్టడమేనని అన్నారు. ఆయా సమావేశాల్లో గుజ్జ కృష్ణ, సత్యం, నీల వెంకటేశ్, రాజేందర్, అనంతయ్య, రాజ్ కుమార్, భాగ్యలక్ష్మి, జిల్లపల్లి అంజి, అల్లంపల్లి రామకోటి, మోడీ రాందేవ్, రాజు నేత తదితరులు పాల్గొన్నారు.