
- రాస్తారోకోలు, బంద్‌లు, దిష్టిబొమ్మలు దహనం
నెట్‌వర్క్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీల డ్రామాల వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాలు మండిపడ్డాయి. జీవో9పై హైకోర్టు స్టే విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు తదితర ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.
పలుచోట్ల బంద్ పాటించారు. బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు డ్రామాలాడుతున్నాయని, అగ్రవర్ణాల కుట్ర వల్లే హైకోర్టు స్టే వచ్చిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ ఆరోపించారు. ఒక పార్టీపై మరో పార్టీ నిందలు వేస్తూ బీసీలను బలి పశువులను చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద ధర్నా చేపట్టి, దిష్టిబొమ్మ దహనం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించి ఉంటే స్టే వచ్చేది కాదన్నారు. బీజేపీ గల్లీలో మాట.. ఢిల్లీలో మరో మాట మాట్లాడుతున్నదని ఫైర్ అయ్యారు. కరీంనగర్ సిటీలోని తెలంగాణ చౌక్ లో శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. అనంతరం బీసీ సంఘాల లీడర్ల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
హుస్నాబాద్ బంద్..
జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టేను నిరసిస్తూ శుక్రవారం హుస్నాబాద్ బంద్ నిర్వహించారు. పట్టణంలోని షాపులు, హోటళ్లు, వైన్స్‌లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బీసీలపై ఏ పార్టీకీ నిజమైన ప్రేమ లేదని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రవీందర్ గౌడ్మండిపడ్డారు. ప్రధాన పార్టీలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. మున్సిపల్ ఆఫీసు దగ్గరున్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
తాడ్వాయి మండల కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో బంద్నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్వేసిన బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మతో ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో నిరసన తెలిపారు. దిష్టిబొమ్మను కాల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తలమడుగు మండలంలోని సుంకిడి వద్ద బీసీ సంఘాలు రాస్తారోకో చేపట్టాయి.