
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో 14 ఏండ్లుగా నెలకొన్న విగ్రహాల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. మేయర్ గేటు ముందు 2011లో అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పోటీగా, అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అర్ధరాత్రి ఆగమేఘాలపై వైఎస్ఆర్ విగ్రహానికి ఒకవైపు బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, మరో వైపు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అప్పట్లో దుమారం రేపింది.
వైఎస్ విగ్రహం ఎత్తులో ఉండగా, ఇరువైపులా కింది భాగంలో అంబేద్కర్, గాంధీల విగ్రహాలు ఉండడంతో ప్రారంభానికి నోచుకోలేదు. తాజాగా ఇప్పుడు మరోసారి ఈ విగ్రహాల వివాదం తెరపైకి వచ్చింది. ఈ విగ్రహాలను ఇక్కడి నుంచి తరలించి, జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని పార్కు, మెయిన్ గేటుకు ఇరువైపులా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. కానీ, దీనిపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వదిలేశారు. తాజాగా ఈ విగ్రహాలను తరలించాలన్న ప్రతిపాదన గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుకు రానుంది.
ఈ విగ్రహాల్లో వైఎస్ ఆర్ విగ్రహం భారీ సైజులో ఉండటం, ఏర్పాటు చేసిన దిమ్మెకు ఇరువైపు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయటం పట్ల అప్పట్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల యూనియన్ సైతం తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి ఈ విగ్రహాల పంచాది కొనసాగుతూనే ఉంది.
వీటిని ముట్టుకుంటే మళ్లీ ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయంతో ఇప్పటి వరకు ఎవరూ ఆ వివాదాన్ని పట్టించుకోలేదు. 14 ఏళ్ల తర్వాత ఈ విగ్రహాలను తరలించాలంటూ వచ్చిన ఈ ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ స్టాండింగ్ కమిటీలో మొత్తం 16 అంశాలు ఉండగా ఇదే అంశంపై ప్రధానంగా ఉంది.