పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పడిపోయాయి. ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 సూచీ 24,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం 11:45 గంటలకు, సెన్సెక్స్ 562.51 పాయింట్లు (0.73%) తగ్గి 76,706.89 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 183.70 పాయింట్లు (0.76%) తగ్గి 23,935.60 వద్ద ఉంది.
సెన్సెక్స్ స్టాక్స్‌లో 22 స్టాక్స్ క్షీణించగా.. ఇండిగో, టెక్ మహీంద్రా అత్యధికంగా నష్టపోయాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్స్ కూడా భారీగా పడిపోయాయి. మరోవైపు, ఐటీసీ, ఇన్ఫోసిస్, మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ట్రెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ లాభపడిన షేర్స్ లో ఉన్నాయి.
సెక్టోరల్ ఇండెక్స్ లో నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ షేర్లు పడిపోయాయి. మరోవైపు, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, ఐటీ అండ్ మీడియా షేర్లు లాభపడ్డాయి. హోర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పులు జరగడంతో, అక్కడ శాంతిపై ఆశలకు గండి పడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కూడా కనిష్ట స్థాయికి పడిపోయింది.
ట్రంప్ బెదిరింపు
ఇదిలా ఉండగా, ఇరాన్ యూఏఈపై క్షిపణిలు, డ్రోన్ దాడులు చేయడంతో పాటు, హోర్ముజ్ జలసంధి సమీపంలో దక్షిణ కొరియాకు చెందిన ఒక సరుకు రవాణా నౌకపై కూడా కాల్పులు జరిపింది. మరోవైపు, సరుకు రవాణాకు రక్షణగా వెళ్తున్న అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేస్తే, ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
