ఉజ్జయినిలో అల్లర్లు..వీహెచ్ పీ నేతపై దాడితో హింస..పలు ఇండ్లు, వెహికల్స్ ధ్వంసం

ఉజ్జయినిలో అల్లర్లు..వీహెచ్ పీ నేతపై దాడితో హింస..పలు ఇండ్లు, వెహికల్స్ ధ్వంసం
  • ఐదుగురు నిందితుల అరెస్టు

భోపాల్: విశ్వ హిందూ పరిషత్ యువనేతపై జరిగిన దాడి తీవ్రమైన హింసకు దారితీసింది. మధ్యప్రదేశ్‌‌ ఉజ్జయిని జిల్లాలోని తరానా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఉజ్జయిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సొంత జిల్లా కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

స్థానికంగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) కు చెందిన గో సేవా ప్రకోష్ఠకు నాయకత్వం వహిస్తున్న సోహల్ ఠాకూర్ బుండేలాకు మైనారిటీ వర్గానికి చెందిన కొంత మంది వ్యక్తులతో వాగ్వాదం జరిగింది. అనంతరం వారు అతడిపై దాడి చేయడంతో  గాయాలయ్యాయి. ఈ క్రమంలో రెండు వర్గాలకు  చెందిన వారు వీధుల్లోకి వచ్చి రాళ్ళు విసురుకుంటూ ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

శుక్రవారం ప్రార్థనల తర్వాత మరోసారి హింస

తరానాలో శుక్రవారం ప్రార్థనల తర్వాత మరోసారి హింస చెలరేగింది. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కత్తులు, రాడ్లు, లాఠీలు పట్టుకున్న కొంతమంది వ్యక్తులు తమ పరిసరాల్లోకి ప్రవేశించారని, ఇండ్లపై రాళ్లు విసిరారని, ప్రార్థన స్థలాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఒక వర్గానికి చెందిన స్థానిక మహిళలు ఆరోపించారు. 

శుక్రవారం దాడి కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హింసలో 13 బస్సులు, 10 కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బస్సుకు నిప్పు పెట్టారు. 4 ఇండ్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు15 నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.