V6 News

నా ఇంటిపై రాళ్లు రువ్వారు: యువరాజ్ సింగ్

నా ఇంటిపై రాళ్లు రువ్వారు: యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్ లో వరల్డ్ కప్ ల హీరోగా యువరాజ్ సింగ్ ను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. 2007 టీ20 వరల్డ్ కప్ తోపాటు 2011 వన్డే వరల్డ్ కప్ లు టీమిండియా ఒడిలో చేరడంలో ఈ లెఫ్టాండర్ కీలకపాత్ర పోషించాడు. ఆ రెండు టోర్నీల్లోనూ యువీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలవడం విశేషం. అయితే క్యాన్సర్ తో 2011 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమైన యువీ కమ్ బ్యాక్ లో మునుపటి జోరు చూపించలేకపోయాడు. ముఖ్యంగా 2014 టీ20 ప్రపంచకప్ లో యువీపై ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇండియాకు మరో ఐసీసీ టైటిల్ అందిస్తాడని అందరూ ఊహించారు. అయితే ఆ టోర్నీ ఆసాంతం యువీ కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దీనిపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యువీ స్పందించాడు. టోర్నీ ఫైనల్స్ లో శ్రీలంకతో మ్యాచ్ లో యువీ 21 బాల్స్ ఎదుర్కొని 11 రన్స్ చేశాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 130 రన్స్ మాత్రమే చేయగలిగింది. లంక 17.5 ఓవర్లలో 134 రన్స్ చేసి కప్ సొంతం చేసుకుంది. ఈ పరాజయం తర్వాత మీడియాతోపాటు ఫ్యాన్స్ కూడా యువీపై విపరీతంగా విమర్శలకు దిగారు. ఆ టైమ్ లో కొంత మందిని చంపిన విలన్ గా తనను తాను భావించినట్లు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యువీ చెప్పాడు.

‘2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆడిన ఇన్నింగ్స్ కు నాదే పూర్తి బాధ్యత. నేను సరిగ్గా ఆడలేదు. దురదృష్టం ఏంటంటే అది ప్రపంచ కప్ ఫైనల్. అది వేరే గేమ్ అయితే పరిస్థితి అంత తీవ్రంగా ఉండేది కాదు. తిరిగి ఇంటికొచ్చినప్పుడు నన్ను నేను విలన్ గా భావించా. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రావడం నాకు ఇంకా గుర్తుంది. ఆ టైమ్ లో లక్కీగా హెడ్ ఫోన్స్ నాతోనే ఉన్నాయి. మీడియా ప్రశ్నలతో దాడి చేసింది. నా మీద మీడియా వాళ్లు అరిచారు. చండీగఢ్ లోని నా ఇంటిపై కొందరు రాళ్లు రువ్వారు. ఆ సమయంలో ఎవరో ఒకరిని చంపి జైలుకు వెళ్లిన నేరస్థుడిలా నన్ను నేను భావించా. అయితే నేను దాని నుంచి తేరుకున్నా. కానీ ఆ క్షణంలో నేను ఎలా ఉన్నానో ఇంకా గుర్తుంది. ఆ రోజు సచిన్ ట్వీట్ చేయడం కూడా యాదుంది. ఇంటికెళ్లాక ఆరు సిక్సులు కొట్టడాన్ని గుర్తు చేసుకున్నా. నా ఇండియా క్యాప్ ను సిక్స్ సిక్సెస్ కొట్టిన బ్యాట్ పై పెట్టా. నా కెరీర్, టైమ్ ముగిసిందని అనుకున్నా’ అని యువీ పేర్కొన్నాడు.