నిజమైన స్నేహం అంటే ఇది కదా.. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి..!

నిజమైన స్నేహం అంటే ఇది కదా.. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి..!

మాదారం బడిలో వైష్ణవి, రేణు శ్రీ పదో తరగతి చదువుతున్నారు. వైష్ణవి, రేణు శ్రీ కంటే చదవడం, రాయడంలో కొంచెం ముందు ఉండేది. ఇద్దరూ చదువులో, ఆటలలో పోటీపడేవారు.ఇద్దరూ ఎలాంటి అసూయపడకుండా పోటీ ఉన్నప్పటికీ ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. పాఠశాలలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒకసారి స్కూలులో ‘‘డ్రగ్స్ దుష్ఫలితాలు- నివారణ మార్గాలు’’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు హెడ్మాస్టర్ నోటీసు ద్వారా విద్యార్థులందరికీ తెలియజేశారు.

వ్యాస రచన పోటీకి సమయం రెండు రోజులు మాత్రమే ఉండడంతో వైష్ణవి రాత్రి, పగలు కష్టపడి చదివింది. బహుమతి గెలవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. వైష్ణవికి కచ్చితంగా బహుమతి వస్తుందన్న నమ్మకం ఉపాధ్యాయులలో, విద్యార్థుల్లో దృఢంగా ఉండేది. అయితే బాగా చదివిన వైష్ణవికి తెల్లారితే పోటీ ఉన్న సమయంలో రాత్రి తీవ్రమైన జ్వరం వచ్చింది. స్కూలుకి వెళ్లలేకపోయింది. వ్యాస రచన రాయలేకపోతున్నందుకు చాలా బాధపడింది.

వైష్ణవికి జ్వరం వచ్చిన విషయం తన స్నేహితురాలు రేణిశ్రీ కి తెలిసింది. వెంటనే వైష్ణవి ఇంటికి వెళ్లి నీవు బాధపడకు. నువ్వు రాసి చదివిన నోట్స్ నాకివ్వు అని అడిగింది. రేణు శ్రీ తన స్నేహితురాలికి సాయం చేద్దాం అనే ఆలోచనతో నోట్స్ తీసుకుని వెళ్లి  కొద్దిసేపు చదివింది. పాఠశాలలో ఉదయం11 గంటలకు వ్యాససన పోటీ ప్రారంభమైంది. ఆంగ్ల భాషలో రాసే ఈ పోటీలో రేణు శ్రీతో పాటు15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫలితాలు ప్రకటించే సమయం వచ్చేసింది. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు దిద్ది ఫలితాలు ప్రకటించారు.

రేణు శ్రీ ప్రథమ బహుమతి గెలుచుకుంది. మధ్యాహ్నం మూడు గంటలకు హెడ్మాస్టర్ బహుమతి ప్రదాన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలీస్ శాఖకు చెందిన సబ్ ఇన్​స్పెక్టర్ డ్రగ్స్ వల్ల విద్యార్థులు ఏవిధంగా నష్టపోతున్నారో చాలా చక్కగా వివరించాడు. విద్యార్థులు క్రమశిక్షణతో అంశాన్ని అర్థం చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు ఎస్ఐ చేతుల మీదుగా ప్రథమ బహుమతి రేణిశ్రీ అందుకుంది. అనంతరం హెడ్మాస్టర్​ రేణు శ్రీని మాట్లాడమని చెప్పింది.

రేణు శ్రీ మాట్లాడుతూ ‘‘గౌరవనీయులైన పెద్దలారా, ప్రియమైన విద్యార్థులారా.. ఈ క్రెడిట్ నాది కాదు. నాకు ప్రాణ సమానురాలైన వైష్ణవిది. ఎందుకంటే నిజానికి వ్యాసరచన అంశంపై నేను ప్రిపేర్ కాలేదు. బాగా ప్రిపేర్ అయిన వైష్ణవికి జ్వరం వచ్చిన సంగతి తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్లి ఆమె తయారుచేసుకున్న నోట్స్ తీసుకుని నేను చదివి రాశాను.

వైష్ణవి తాను పోటీలో పాల్గొనలేకుండ పోయిందన్న బాధను మర్చిపోవడానికి నాకు వచ్చిన బహుమతి ఆమెకే చెందుతుంది. ఆమె ఎంతో కష్టపడి తయారు చేసుకున్న నోట్స్ రాయడం వల్లే నాకు బహుమతి లభించింది. వైష్ణవి లాంటి కష్టపడే మంచి స్నేహితురాలని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి ఆమె కష్టాన్ని గుర్తించి క్రెడిట్ ఆమెకి ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని రేణు శ్రీ అంది. రేణు శ్రీ మాటలు విన్న అందరూ ‘శభాష్’ అంటూ చప్పట్లతో మారుమోగించారు.

రేణుశ్రీ, వైష్ణవి ఇంటికి వెళ్లి బహుమతిని చూపిస్తూ అక్కడ జరిగిన సంఘటనలను చెప్పింది. వైష్ణవి ఆశ్చర్యపోయి ఇలా అన్నది. ‘‘నువ్వు నా పేరు ఎందుకు చెప్పావు? నువ్వే ఆ ప్రైజ్ తీసుకోవచ్చు కదా! దీన్ని నీ దగ్గరే ఉండనివ్వు అని రేణి శ్రీని కోరింది. కానీ రేణు శ్రీ ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే నీకు జ్వరం రాకుంటే ఎలాగూ పోటీలో పాల్గొనేదానివి. కచ్చితంగా నీకే బహుమతి వచ్చేది. కాబట్టి ఈ బహుమతి నీకే చెందాలి అని చెప్పి బహుమతి ఇచ్చింది. బహుమతి ఇచ్చినందుకు రేణు శ్రీకి కృతజ్ఞతలు చెప్పి మన స్నేహం ఇలాగే నిరంతరం కొనసాగాలని ఇద్దరూ అనుకున్నారు. నిజమైన స్నేహం అంటే మీదే.. అని అక్కడున్న తోటి ఫ్రెండ్స్​ వాళ్లిద్దరినీ పొగడ్తలతో ముంచెత్తారు.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి