- సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపణ
- 100 బాంబులు వేసి 254 మందిని చంపడంపై ఫైర్
- 1982 తర్వాత లెబనాన్‌పై ఇవే భయంకరమైన దాడులు
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని ఇరాన్ మరోసారి మూసివేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాంతో హార్మూజ్ తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అయితే, సీజ్ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జలసంధిని మూసివేసింది.
కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించినప్పటికీ..ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేశారు. ఇరాన్ వెంటనే జలసంధిని తెరిస్తే రెండు వారాల కాల్పుల విరమణ నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుందని మొదట ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో లెబనాన్ లేదని ఆయన మరో ట్వీట్లో కుండబద్దలు కొట్టారు.
ట్వీట్ చేసిన కాసేపటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు విసరడంతో లెబనాన్‌లో 254 మంది చనిపోయారు. 1982 నాటి యుద్ధం తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన అత్యంత భయంకరమైన, భారీ దాడులు ఇవేనని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలను ట్రంప్ కూడా సమర్థించారు.
