చచ్చిపోతానంటూ నానా రచ్చ.. దగ్గరకొస్తే దూకేస్తానన్న యువకుడు.. హైదరాబాద్ అత్తాపూర్లో ఘటన

చచ్చిపోతానంటూ నానా రచ్చ.. దగ్గరకొస్తే దూకేస్తానన్న యువకుడు.. హైదరాబాద్ అత్తాపూర్లో ఘటన

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు చచ్చిపోతానని ఓ యువకుడు నానా హంగామా చేశాడు. అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్ గూడ సిరిమల్లె నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కిన యువకుడు కిందకు దూకేస్తానని అక్కడున్న వారిని టెన్షన్ పెట్టేశాడు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గర కట్టెల గోవా చివరి అంచున నిలబడి కిందకు దూకేస్తానంటూ బెదిరించాడు.

100కు కాల్ చేసి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి పెట్రోలింగ్ పోలీసులు చేరుకున్నారు. దగ్గరికి వస్తే కిందకు దూకేస్తానంటూ ఆ యువకుడు పోలీసులను కూడా బెదిరించి, తన దగ్గరికి ఎవ్వరూ రావద్దని హెచ్చరించాడు. మూడు గంటల పాటు పోలీసులను, స్థానికులను ఆ యువకుడు ముప్పతిప్పలు పెట్టాడు.

రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ ఎస్ఐ రఘు అతనిని మాటల్లో పెట్టి ఒక్కసారిగా ఆ యువకుడిని పట్టుకొని కిందకు దింపి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంత హంగామా చేసిన ఈ యువకుడిని శంషాబాద్కు చెందిన ఎల్లయ్యగా గుర్తించారు. ఘన్సీమియాగూడలో వ్యవసాయం చేస్తూ ఎల్లయ్య జీవనం సాగిస్తున్నాడు. శంషాబాద్ నుంచి అత్తాపూర్కు వెళ్లి ఆత్మహత్యకు యత్నించాడు. చాకచక్యంగా వ్యవహరించి ఎల్లయ్యను కాపాడిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ రాఘవేంద్ర, అంజలయ్య, మరో లేడీ కానిస్టేబుల్ను స్థానికులు అభినందించారు.