V6 News

3 నెలల్లో 45 మందిపై కుక్కల దాడి

3 నెలల్లో 45 మందిపై కుక్కల దాడి
  •     అడ్డగుట్ట పీహెచ్​సీకి బాధితులు
  •     సీతాఫల్​మండి, మెట్టుగూడ, చిలకలగూడలోనూ వీధి కుక్కల బెడద
  •     నామ్ కే వాస్తేగాఅధికారుల చర్యలు 

సీతాఫల్ మండి, వెలుగు: గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నా దాడులు ఆగట్లేదు. రెండ్రోజుల కిందట సంతోష్ నగర్​లో నాలుగేండ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సికింద్రాబాద్ సెగ్మెంట్ లోనూ రోజురోజుకి కుక్కల బెడద తీవ్రమైతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డగుట్టలోని పీహెచ్​సీకి 3 నెలల్లో 45 మంది కుక్కకాటుకు గురైన బాధితులు రాగా.. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.  ఒక్క మే నెలలోనే కుక్కకాటు కేసులు 15 వచ్చినట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. సీతాఫల్ మండి కుట్టి వెల్లోడి ఆస్పత్రికి 5 , మెట్టుగూడ డివిజన్ దూద్ బావి ఆస్పత్రికి 2 కేసులు వచ్చాయి.

సీతాఫల్​మండి, నామాలగుండు, చిలకలగూడ, మెట్టుగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో వీధి కుక్కల దాడులకు ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్​సీలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. కుక్కలు దాడి చేసినప్పుడే అధికారులు హడావుడి చేస్తూ నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప ముందస్తుగా వాటిని తరలించడం, అబ్జర్వేషన్​లో ఉంచడం లాంటివి చేయట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘ డైలీ వాకింగ్​కు వెళ్తుంటే పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. ఓసారి చిన్న పిల్లలపై దాడికి యత్నించిన కుక్కలకు తరిమికొట్టాం. పిల్లలను స్కూల్​కు పంపాలంటే కుక్కల భయానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వారి వెంట వెళ్లాల్సిన పరిస్థితి. కుక్కల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని సీతాఫల్​మండికి చెందిన సందీప్ రాజ్ కోరాడు.