నిర్మల్లో చెరువు భూముల పరిరక్షణకు గట్టి చర్యలు

నిర్మల్లో చెరువు భూముల పరిరక్షణకు గట్టి చర్యలు
  •     లేక్​ప్రొటెక్షన్​ కమిటీల ఏర్పాటు
  •     మొదలుకానున్న సర్వే..
  •     కబ్జాదారులపై నజర్.. క్రిమినర్ చర్యలకు రంగం సిద్ధం

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న చెరువు భూముల ఆక్రమణపై యంత్రాంగం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ(ఎల్ పీసీ) లను ఏర్పాటు చేసింది. అడిషనల్ ఎస్పీతో పాటు ఆర్డీఓ, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ, ఇరిగేషన్ ఈఈ, మున్సిపల్ కమిషనర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు.  మరో రెండు రోజుల్లో ఈ కమిటీలు రంగంలోకి దిగనున్నాయి.

జిల్లాలోని చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్​లలో ఆక్రమణకు గురైన భూములు, అక్కడ జరిగిన  అక్రమ నిర్మాణాలను కమిటీ సభ్యులు గుర్తించనున్నారు. దీంతోపాటు కబ్జాదారుల జాబితాను రూపొందించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోనున్నారు.

కబ్జా కోరల్లో గొలుసుకట్టు చెరువులు

నిర్మల్​లోని చారిత్రక గొలుసుకట్టు చెరువు భూముల ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇక్కడి గొలుసుకట్టు చెరువు భూముల విస్తీర్ణంతోపాటు శిఖం, ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​లను రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు గతంలోనే గుర్తించారు. కానీ చెరువు భూముల ఆక్రమణను కట్టడి చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కబ్జాలపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ భూముల నిర్ధారణ, రక్షణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే చెరువు భూములపై డీజీపీఎస్ విధానంతో సర్వే చేపట్టారు. మొత్తం 11 గొలుసుకట్టు చెరువులపై సర్వే చేపట్టి విస్తీర్ణాన్ని నిర్ధారించారు.

బ౦గల్ పేట చెరువు 210.32 ఎకరాలు, మోతి తలాబ్ 132.06 ఎకరాలు, ఖజానా చెరువు 98.22, కొత్త చెరువు 33.11, రాంసాగర్ 37.23, జాపూర్ కుర్రనపేట చెరువు 76.18, సీతాసాగర్ గొల్లపేట చెరువు 48.11, ఇబ్రహీం చెరువు 76.18, క౦చరోని చెరువు 74.19, ధర్మసాగర్ చెరువు 65.10, చిన్న చెరువు మంజులాపూర్ 81.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు శిఖంతోపాటు ఎఫ్టీఎల్ ను కూడా గుర్తించిన అధికారులు ఎఫ్టీఎల్ నుంచి 90 అడుగుల దూరం వరకు బఫర్ జోన్ గా  నిర్ధారించారు. ఈ బఫర్ జోన్ వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదన్న నిబంధన ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు చెరువు భూములకు హద్దులు నిర్ధారించడమే కాకుండా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు.

దీంతో కొద్ది రోజులపాటు చెరువు భూముల ఆక్రమణలు నిలిచిపోయాయి. కానీ ప్రస్తుతం మళ్లీ కొంతమంది ఈ హద్దులను చెరిపేస్తూ ఆక్రమణల పర్వానికి తెరలేపుతున్నారు. అప్పట్లో హద్దులు నిర్ణయించిన అధికారులు బదిలీ కావడం, కొత్త అధికారులకు హద్దులపై పెద్దగా అవగాహన లేకపోవడం కబ్జాదారులకు కలిసొస్తోంది.

అయినా ఆగని ఆక్రమణలు

నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై నిరుడు ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆక్రమణలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, కలెక్టర్​కు నోటీసులు సైతం జారీ చేసింది. జిల్లా కోర్టు న్యాయమూర్తిని చెరువుల ఆక్రమణలపై పరిశీలించాలని సూచించింది. కలెక్టర్​కు కోర్టు హెచ్చరికలు జారీ చేయడంతో నాటి యంత్రాంగం ఒక్కసారి కదిలింది. హుటాహుటిన జీపీఎస్ విధానంతో చెరువు భూముల సర్వేలు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన హద్దుల ఆధారంగా ఫెన్సింగ్​ను ఏర్పాటు చేసి, ట్రెంచ్​లను తవ్వడం లాంటి చర్యలు తీసుకున్నారు.

అయినా భూ బకాసురులు ఆగడలేదు. ఇప్పుడు కంచరోని చెరువు, ధర్మసాగర్, సీతాసాగర్, పల్లె చెరువు భూములపై కన్నేశారు. చెరువు భూములతోపాటు, వాటికి ఆనుకొని ఉన్న పట్టా భూములను కూడా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల చెరువుల్లో వెంచర్లు కూడా మొదలుపెట్టారు. చెరువు భూముల ఆక్రమణ బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

క్రిమినల్ చర్యలు తీసుకుంటాం..

చెరువు భూముల ఆక్రమణలపై సర్వే పూర్తికాగానే చర్యలు మొదలు పెడతాం. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటాం. భూ ఆక్రమదారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. సర్వేలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. చెరువు భూముల సరిహద్దులను నిర్ధారించి ఫెన్సింగ్ లు ఏర్పాటు చేస్తాం. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చెరువు భూములను రక్షిస్తాం.
 – కిషోర్ బాబు, అడిషనల్ కలెక్టర్, నిర్మల్