34వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

34వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ సమ్మె 34వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా… సమ్మె విరమించేది లేదంటోంది ఆర్టీసీ జేఏసీ. ఎటువంటి హామీ లేకుండా ఉద్యోగాల్లో చేరమని తేల్చి చెబుతున్నారు కార్మికులు.  ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.  డిపోల ముందు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.  బస్సులు బయటకు తీయకుండా అడ్డుకుంటున్నారు.

హైకోర్ట్ లో  ఇవాళ  కీలక విచారణ జరగనుంది. గత శుక్రవారం ఆర్టీసీపై విచారించిన ఉన్నత న్యాయస్థానం… ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది.  బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణ రాయితీని బకాయిల చెల్లింపుగా నివేదికలో ఎలా చెబుతారని నిలదీసింది.  IAS అధికారులు లెక్కలతో గందరగోళం సృష్టిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.  మరోసారి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది హైకోర్టు.

హైకోర్ట్ ఆదేశాలతో.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్,  ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు,  ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుంచి ఇవ్వాల్సిన బకాయిలేవీ లేవని,  ఆర్టీసీ నష్టాలను జీహెచ్ఎంసీ భరించాల్సిన అవసరమే లేదని అటు సర్కారు,  ఇటు జీహెచ్ఎంసీ హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేశాయి.  తాము ఏటా ఆర్టీసీకి ఆర్థికంగా అండగా ఉంటున్నామని, ఆర్టీసీయే సర్కారుకు పన్నుల బకాయిలు ఉందని తెలిపారు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి.  జీహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు ఆర్టీసీకి నిధులు ఇచ్చామని, తర్వాత ఆర్థిక లోటుతో సాయం చేయలేకపోయామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. సర్కారు నుంచి గానీ, జీహెచ్ఎంసీ నుంచి గానీ రావాల్సిన బకాయిలేవీ లేవంటూ ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ విడిగా మరో కౌంటర్ దాఖలు చేశారు.