హాస్పిటళ్ల సమ్మె ముగిసింది

హాస్పిటళ్ల సమ్మె ముగిసింది
  • ఆరోగ్యశ్రీ’ బకాయిలపై మంత్రి ఈటల‌తో జరిపిన చర్చలు సఫలం
  • బకాయిల చెల్లింపు, ఎంవోయూ సవరణకు సర్కారు అంగీకారం
  • నేడు రూ.100 కోట్లు, సెప్టెంబర్‌‌లో మరో రూ.200 కోట్ల విడుదలకు ఓకే
  • నేటి నుంచి యధావిధిగా
    ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ సేవలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగుఆరోగ్యశ్రీ బకాయిల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నెట్​వర్క్​ హాస్పిటళ్లు సమ్మె విరమించాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ తో చర్చల తర్వాత సమ్మె విరమిస్తున్నట్టు హాస్పిటల్స్‌‌‌‌  అసోసియేషన్‌‌‌‌  ప్రతినిధులు మంగళవారం రాత్రి ప్రకటించారు. బుధవారం రూ.వంద కోట్లు, పది రోజుల్లోగా మరో రూ.60 కోట్లు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో మరో రూ.200 కోట్ల విడుదలకు మంత్రి హామీ ఇచ్చారని అసోసియేషన్​ జనరల్ సెక్రెటరీ డాక్టర్ హరిప్రకాశ్‌‌‌‌ తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్​ స్కీమ్​ పథకాల సేవలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందంలోని లొసుగులే సమస్యలకు దారి తీస్తున్నాయని అసోసియేషన్​ ప్రెసిడెంట్​ డాక్టర్  రాకేశ్‌‌‌‌  అన్నారు. తాము ఐదేళ్ల నుంచి పోరాడుతున్నామని, ఇప్పుడు మంత్రి ఈటల ఇచ్చిన హామీ మరువలేనిదని చెప్పారు. మంత్రి ఈటల వల్లే ముఖ్యమంత్రి స్పందించారని తెలిపారు. ఇకపై నెట్​వర్క్​ హాస్పిటల్స్​ అసోసియేషన్​ గౌరవ అధ్యక్షుడిగా మంత్రి ఈటల ఉంటారని ప్రకటించారు.

వేలాది మంది అవస్థలు

ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌  స్కీమ్​లకు సంబంధించిన బకాయిలు భారీగా పేరుకుపోవడంతో నెట్​వర్క్​ హాస్పిటళ్లు ఈనెల 16 నుంచి సేవలు నిలిపివేశాయి. అదే రోజున ప్రభుత్వంతో వారు చర్చలు జరిపినా.. బకాయిల లెక్క తేలలేదు. సుమారు రూ.1,200 కోట్ల బకాయిలు ఉన్నట్టు హాస్పిటళ్లు వాదించడం, రూ.600 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆరోగ్యశ్రీ అధికారులు చెప్పడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. దాంతో సర్కారు ఆస్పత్రులవారీగా బకాయిల వివరాలను హాస్పిటళ్ల ప్రతినిధులకు అందజేసింది. అందులో తేడాలు ఉన్నాయని ప్రతినిధులు మంగళవారం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దానిపై స్పందించిన మంత్రి.. బకాయిల్లో తేడాలున్న హాస్పిటళ్ల మేనేజ్​మెంట్లు  ఆరోగ్యశ్రీ ట్రస్టుకు వెళ్లి సమీక్షించుకోవాలని సూచించారు. మేనేజ్​మెంట్లకు సహకరించాలని ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించారు. మొత్తంగా బకాయిల విడుదలకు హామీ ఇచ్చారు. అయితే ఐదు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు ఐదు రోజులపాటు సమ్మె కొనసాగింది. సాధారణంగా రోజుకు ఐదు వేల వరకు ఆరోగ్యశ్రీ కేసులు నమోదవుతాయి. రోగాల సీజన్‌‌‌‌ కావడంతో ఇప్పుడా సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. వారందరికీ తిప్పలు తప్పలేదు.

ప్రతినెలా నిధులిస్తం: ఈటల

ఇకపై ప్రతి నెలా హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌  నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని మంత్రి ఈటల రాజేందర్​ చెప్పారు. హాస్పిటళ్ల ప్రతినిధులతో చర్చల తర్వాత ఆయన మాట్లాడారు. సాధ్యమైనంత వరకు బకాయిలు ఎక్కువగా లేకుండా చూస్తామన్నారు. గతంలోలా కాకుండా ఎప్పటికప్పుడు హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో హాస్పిటళ్లకు ఉన్న ఎంవోయూ వందల పేజీలతో గందరగోళంగా ఉందని, దాన్ని సరళీకరించేందుకు త్వరలో కమిటీ వేస్తామన్నారు. వైద్యసేవల ప్యాకేజీలను కూడా సమీక్షిస్తామని.. అటు హాస్పిటళ్లకు, ఇటు రోగులకు ఇబ్బందుల్లేకుండా ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకమన్నారు. ఆయుష్మాన్‌‌‌‌  స్కీమ్​తో రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకే వైద్యం అందే అవకాశం ఉంటుందని.. ఆరోగ్యశ్రీ కింద 85 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్యం అందజేస్తున్నామని చెప్పారు.