రివేంజ్ అంటే ఇది..! అడ్మిషన్ ఇవ్వలేదని IIT కాన్పూర్ వెబ్ సైట్ హ్యాక్ చేసిన స్టూడెంట్

రివేంజ్ అంటే ఇది..! అడ్మిషన్ ఇవ్వలేదని IIT కాన్పూర్ వెబ్ సైట్ హ్యాక్ చేసిన స్టూడెంట్

ప్రతి విద్యార్థికి ఒక డ్రీమ్ కాలేజ్, డ్రీమ్ కోర్సు ఉంటుంది. ఆ కాలేజీలో చదువుకోవాలని.. ఆ కోర్స్ చేయాలని కలలు కంటారు. కొందరికి అది కుదురుతుంది. మరికొందరికి వివిధ కారణాల వల్ల వీలు కాదు. నచ్చిన కాలేజీలో అడ్మిషన్ దొరకకపోతే తప్పని పరిస్థితుల్లో మరో కాలేజీలో జాయిన్ అవుతుంటారు. కానీ ఓ విద్యార్థి మాత్రం ఇలా చేయలేదు. తనకు అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీ వెబ్ సైట్ హ్యాక్ చేశాడు. ఏ హ్యాకింగ్ కోర్సులో అయితే జాయిన్ అవ్వడానికి తనను రిజెక్ట్ చేశారో.. అదే కాలేజీ వెబ్ సైట్ హ్యాక్ చేసి తన హ్యాకింగ్ స్కిల్స్ ప్రదర్శించాడు. మొత్తానికి సదరు స్టూడెంట్ టాలెంట్ గుర్తించిన కాలేజ్ అతడికి అడ్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకునేందుకు మరో అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

దేశంలో ప్రముఖ ఐఐటీల్లో ఒకటైన ఐఐటీ కాన్పూర్‎లో సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అడ్మిషన్ కంటే ముందే హ్యాకథాన్‌లతో పాటు విద్యార్థుల సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించడానికి వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న ఓ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. ఎంపిక ప్రక్రియలో తన సామర్థ్యాలను నిరూపించుకోలేకపోవడంతో అడ్మిషన్ దొరకలేదు.

దీంతో ఎలాగైనా ఐఐటీ కాన్పూర్‎లో అడ్మిషన్ సంపాదించాలని సదరు యువకుడు భావించాడు. ఇందుకోసం వినూత్న ప్రయోగం చేశాడు. ఏకంగా ఐఐటీ కాన్పూర్ అఫిషియల్ వెబ్ సైట్ హ్యాక్ చేశాడు. తాను విఫలమైన హ్యాకింగ్‎ విభాగంలోనే తన సత్తా చూపెట్టాడు. వెబ్ సైట్ హ్యాక్ చేసి.. ‘‘సైట్ హ్యాక్ చేయబడింది. నాకు కావలసిందల్లా ఒక న్యాయమైన అవకాశం మాత్రమే’’ అనే సందేశాన్ని పంపాడు.

ఆ తర్వాత ఎక్స్, రెడ్డిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‎లలో హ్యాకింగ్ సంబంధించిన ఫొటోలు షేర్ చేసి.. ఈ ఘటనకు తానే బాధ్యుడినని ప్రకటించాడు. ఐఐటీ కాన్పూర్ వెబ్ సైట్‎ను హ్యాక్ చేయాలని ఉద్దేశం తనకు అస్సలు లేదని.. కేవలం తన సైబర్‌సెక్యూరిటీ నైపుణ్యాలను ప్రదర్శించడానికే ఇలా చేశానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై మొదట పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న ఐఐటీ కాన్పూర్ ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది.

ఓ విద్యార్థి జీవితం నాశనం చేయొద్దనే ఉద్దేశంతో పోలీసులకు కంప్లైంట్ చేయలేదు. అంతేకాకుండా హ్యాకింగ్‎లో తన ప్రతిభ చూపెట్టిన విద్యార్థికి అడ్మిషన్ కోసం రెండోసారి అవకాశం కల్పించింది. అయితే, అవకాశాల కోసం ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదని సదరు విద్యార్థికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఒక యువ విద్యార్థి భవిష్యత్తును ప్రమాదంలో పడేయకుండా ఐఐటీ కాన్పూర్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు.