ఒక్కటే కిడ్నీ ఉన్నా కనికరించలె

ఒక్కటే కిడ్నీ ఉన్నా కనికరించలె

వంద గుంజిళ్లు తీయించిన టీచర్​, బౌన్సర్​

ఆ తర్వాత పావుగంట సేపు గోడకుర్చీ కూడా

ఆ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి ఒక్కటే కిడ్నీ ఉంది. దాంతో ఎన్నో సమస్యలు. అయినా, టీచర్​ కనికరించలేదు. ఒక్కటే కిడ్నీ అన్న జాలి చూపించలేదు. బయటనిలబెట్టాడు. స్కూల్లోని బౌన్సర్‌ సాయం  తీసుకుని  అతడితో వంద గుంజిళ్లు తీయించాడు. అది చాలదన్నట్టు పావుగంట సేపు గోడ కుర్చీ వేయించాడు. దీంతో పదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడికి తీవ్రమైన కడుపు, కాళ్ల నొప్పి వేధించింది. తల్లిదండ్రులు టీచర్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో ఉన్న మహవీర్​ ఇంగ్లిష్​ మీడియం స్కూల్​ అండ్​ జూనియర్​ కాలేజీలో సోమవారం జరిగింది. అంత పెద్ద శిక్ష వేయడానికి అతడు చేసిన తప్పు, ఇంటి దగ్గర హిందీ వర్క్​బుక్​ మరచిపోయి రావడమే. తల్లిదండ్రుల ఫిర్యాదుతో టీచరు, బౌన్సర్​పై జువెనైల్​ జస్టిస్​ యాక్ట్​ 2015, సెక్షన్​ 75 (పిల్లలపై క్రూరత్వం) కింద స్వరగేట్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్​ఐఆర్​లో మరికొందరి పేర్లనూ చేర్చాల్సి ఉంది. యాజమాన్యం చెప్పడం వల్లే టీచర్​ ఆ శిక్ష విధించాడు” అని స్వరగేట్​ పోలీసులు తెలిపారు. అయితే, స్కూలు యాజమాన్యం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ‘‘మేం 15 నుంచి 20 గుంజిళ్లు మాత్రమే తీయమన్నాం. కడుపులో నొప్పి అనగానే ఆపేయమని చెప్పాం. క్రమశిక్షణలో పెట్టాలంటే ఆ మాత్రం శిక్ష అయినా వేయాలి కదా. లేకపోతే పిల్లలు ఎలా గాడిలో ఉంటారు?” అని మహావీర్​ ఇంగ్లిష్​ మీడియం స్కూల్​ ప్రిన్సిపాల్​ అలకనంద సేన్​గుప్తా వివరించారు. బుధవారం స్కూలులో విద్యాశాఖ అధికారులు విచారణ జరిపినట్టు పుణే జిల్లా పరిషత్​ ఎడ్యుకేషన్​ ఆఫీసర్​ ఫర్​ సెకండరీ స్కూల్స్​ గణపత్​ మోరె చెప్పారు.  ఇంతకుముందు తన చిన్న కొడుకునూ చావబాదారని, బౌన్సర్‌పై ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపాల్‌ సరిగ్గా స్పందించలేదని రాలేదని ఆ అబ్బాయి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.