
- గాయం ఉండడంతో వాచిపోయిన కాలు
- అడిగిన పేరెంట్స్‌తో ప్రిన్సిపాల్ వాగ్వాదం, తోపులాట
- బాబు తల్లికి గాయం
అల్వాల్, వెలుగు: పాఠశాలకు యూనిఫామ్ వేసుకురాలేదన్న కారణంగా ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ స్కూల్ బయట నిల్చోబెట్టాడు. చాలాసేపు నిలబడి ఉండడంతో ఆ బాబు కాలు వాచిపోయింది. అడిగేందుకు వెళ్లిన విద్యార్థి తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ వాగ్వాదానికి దిగాడు. తోపులాట జరగడంతో స్టూడెంట్ తల్లికి గాయమైంది. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్ శ్రీదర్శన్ పాఠశాలలో మంజుల–రమేశ్దంపతుల కుమారుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం అతను యూనిఫామ్ వేసుకురాలేదని ప్రిన్సిపాల్ రవి స్కూల్ బయట నిల్చోబెట్టాడు.
అంతకుముందు ఆ విద్యార్థి కాలికి గాయం ఉండడం.. చాలాసేపు నిల్చోవడంతో కాలు వాచిపోయింది. ఇంటికి వెళ్లాక తల్లిదండ్రుల గమనించి ఆరా తీయగా.. ప్రిన్సిపాల్ పనిష్‌మెంట్ ఇచ్చాడని చెప్పాడు. వారు సోమవారం పాఠశాలకు వెళ్లగా ప్రిన్సిపాల్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తోపులాట జరిగి మంజుల చేతికి గాయమైంది. దీంతో బాధితులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. మూడు రోజులు కురిసిన వర్షానికి యూనిఫామ్ఆరకపోవడంతో బాబును సివిల్ డ్రెస్‌లో స్కూల్ కు పంపామని, ప్రిన్సిపాల్ ఇలా చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన తమపై దాడి చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ సీఐ ప్రశాంత్ పేర్కొన్నారు.